సిఐటియు నాయకులపై కేసు కొట్టివేత

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌ : సిఐటియు నాయకులపై పోలీసులు పెట్టిన కేసును మంగళవారం కోర్టు కొట్టివేసింది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు బకాయి ఉన్న మెనూ బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరుతూ 2017 సెప్టెంబర్‌లో కలెక్టరేట్‌ వద్ద సిఐటియు నాయకులు, ఎండిఎం కార్మికులు ధర్నా చేశారు. ఈ నేపథ్యంలో నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. సిఐటియు నాయకులు టివి రమణ, పి శంకరరావు, బి సుధారాణి, బివి రమణ, మద్ధిల రమణ, బల్సా శ్రీను, జివి రమణ, కిల్లంపల్లి రామారావు, తోట జీవ తదితరులపై ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ మొబైల్‌ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. ఈ కేసును సిఐటియు నాయకుల తరుపున న్యాయవాది కె సన్యాసిరావు వాదించారు.

➡️