రాష్ట్రంలో ఊరూరా గూండా రాజ్ : చంద్రబాబు  

chandrababu on ys jagan govt
  • వ్యవస్ధలు లేవు, ప్రభుత్వం లేదు.
  • మార్టూరు, క్రోసూరు ఘటనలు రౌడీ రాజ్యానికి నిదర్శనం
  • పోలీసు శాఖను చట్టబద్ధంగా నడపలేని డీజీపీ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలి

ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో పాలనా వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, ఊరూరా జగన్ గూండా రాజ్ మాత్రమే ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మార్టూరులో మారణాయుధాలతో మైనింగ్ తనిఖీలు, క్రోసూరులో రౌడీ మూకల విధ్వంసానికి పోలీసుల సహకారం అనేది పూర్తిగా గాడి తప్పిన పాలనకు నిదర్శనం అని చంద్రబాబు అన్నారు. మార్టూరులో గూండాలతో, మారణాయుధాలతో గ్రానైట్ పరిశ్రమల్లో తనిఖీల పేరిట చేసిన అరాచకం వ్యవస్థల విధ్వంసానికి నిదర్శనం అన్నారు. మైనింగ్ శాఖలో ఒక ఏడీ స్థాయి అధికారి రౌడీలతో తనిఖీలకు వచ్చిన ఘటన రాష్ట్రంలో గూండా రాజ్ కు ఉదాహరణగా నిలుస్తుంది అన్నారు. దీనిని ప్రశ్నించిన వారిపైనే కేసుల పెట్టి అరెస్టు చేసినందుకు పోలీసులు, అధికారుల సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా క్రోసూరులో ఎమ్మెల్యే కొడుకు వందల మందితో ప్రజల ఆస్తులపై దాడికి దిగితే చర్యలు తీసుకోకపోగా పోలీసులు సహకరించడాన్ని చంద్రబాబు తప్పు పట్టారు.
రాష్ట్ర పోలీసు శాఖ గౌరవాన్ని దిగజార్చిన ఇలాంటి ఘటనలపై స్పందించని డీజీపీ ఎందుకని చంద్రబాబు ప్రశ్నించారు. తాను అధిపతిగా ఉన్న వ్యవస్థను తానే నడిపించలేని పరిస్థితి వచ్చినప్పుడు డీజీపీ ఆ స్థాయి పోస్టులో కూర్చోవడానికి అనర్హులు అని అన్నారు. ఒకప్పుడు దేశం కీర్తించిన మన పోలీసు శాఖ కళ్ల ముందు పతనం అవుతుంటే కట్టడి చేయలేని డీజీపీ తక్షణమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని సూచించారు. కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన జిల్లా ఎస్పీలు…వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా అరాచకాలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. చట్టాన్ని అమలు చేయలేని ఆయా జిల్లాల ఎస్పీలు ఖాకీ యూనిఫాం తీసేసి వైసీపీ జెండానే యూనిఫాంగా కుట్టించుకోవాలని చంద్రబాబు సూచించారు. పోలీసు శాఖలో ఇలాంటి అసమర్థ ఎస్పీలు, అధికారులు హోంగార్డుతో సెల్యూట్ కొట్టించుకునేందుకు కూడా అర్హులు కాదని చంద్రబాబు మండి పడ్డారు. ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్న అధికారులు…చట్టానికి కట్టుబడి పనిచేయాలని చంద్రబాబు అన్నారు. మరో రెండు నెలల్లో ఈ రౌడీమూకలను ప్రజాకోర్టు శిక్షిస్తుందని, తప్పు చేసిన అధికారులను న్యాయస్థానాలు తప్పక శిక్షిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.

➡️