కూటమికి చిరంజీవి మద్దతిచ్చినా మా విజయానికి డోకాలేదు : సజ్జల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి 80 శాతం ప్రజలకు అందిందని, ఎవరు.. ఎవరితో కలిసొచ్చినా గెలుపు మాత్రం వైసిపిదేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టిడిపి, బిజెపి, జనసేన కూటమికి చిరంజీవి మద్దతిచ్చినా తమకు ఏమాత్రం నష్టం లేదని, జగన్‌ విజయానికి ఏమాత్రం డోకా లేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పెనుమలూరులో మీడియాతో మాట్లాడారు. చిరంజీవి కూటమికి మద్దతు ప్రకటించడంతో తమకు మరింత క్లారిటీ వచ్చిందన్నారు. రాష్ట్రంలో అధికారం కోసం నానా జాతి సమితి ఒకవైపు, మంచి చేసిన మేము ఒకవైపు ఉన్నామని చెప్పారు. కూటమికి ఎలాంటి రాజకీయ అజెండా లేదని, కేవలం అధికారం కోసం అనైతిక కూటమి కట్టారని అన్నారు. పెనుమలూరు వైసిపి నుంచి గెలిచిన ఎమ్మెల్యే టిడిపిలోకి ఫిరాయించారని, ఈసారి పెనుమలూరు నుంచి జోగి రమేష్‌ గతం కంటే ఎక్కువ మెజారిటీతో విజయం సాధిస్తారని అన్నారు. పవన్‌కల్యాణ్‌ ఒక పరిపక్వతలేని రాజకీయ నాయకుడని విమర్శించారు.

➡️