తెలంగాణకు చల్లని కబురు – ఈరోజు, రేపు మోస్తరు వర్షాలు

Mar 17,2024 10:07 #cold weather, #rains, #Telangana

తెలంగాణ : వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించింది. ఈరోజు, రేపు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇక, ఇప్పటికే ఉత్తర తెలంగాణలో పలుచోట్ల వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌ సహా తెలంగాణలో వాతావరణం కొంత చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుండటం వల్ల రాగల 24 గంటల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా రాష్ట్రంలో మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు.. ఉత్తర తెలంగాణలో ఈదురు గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఆదిలాబాద్‌, కరీంనగర్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, సిరిసిల్ల, మెదక్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కామారెడ్డిలో పిడుగుపాటు కారణంగా ఇద్దరు మృతిచెందినట్టు తెలుస్తోంది. వర్షాల ప్రభావంతో వచ్చే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెప్పింది. ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలలోపే నమోదవుతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది.

➡️