‘పురం’లో కాంట్రాక్టర్ల నిరసనాగ్రహం

Apr 1,2024 20:31 #attack, #hindu puraam, #muncipal, #ofice
  •  బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంపై ఆందోళన
  •  మున్సిపల్‌ అకౌంటెంట్‌ గదిలో ఫర్నీచర్‌ ధ్వంసం

ప్రజాశక్తి-హిందూపురం : చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కాంట్రాక్టర్లు ఆందోళన దిగారు. మున్సిపల్‌ కార్యాలయంలోని అకౌంటెంట్‌ విభాగం కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. గదిలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం ఆ గదికి తాళాలు వేసి అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడుతూ హిందూపురం మున్సిపాల్టీలో చేసిన పనులకు సంబంధించి రూ.మూడు కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఎన్నికల కోడ్‌ రాకముందే వీటిని సిఎఫ్‌ఎంఎస్‌లో పెట్టాలని కోరినా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. తాము చేసిన పనులకు మార్చి 31వ తేదీ నాటికి గడువు ముగిసిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పలుమార్లు అధికారులను అడిగినా వారు బిల్లులు పెట్టడంలో నిర్లక్ష్యం చేశారని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వం మారితే తమ బిల్లులు వచ్చే పరిస్థితి కష్టం అవుతుందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు బిల్లులు అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో 15 మంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. కాగా మున్సిపల్‌ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కమిషనర్‌ తెలిపారు.

మున్సిపల్‌ కమిషనర్‌కు వినతిపత్రం అందజేస్తున్న కాంట్రాక్టర్లు
➡️