తిరుపతి, ఎర్రగుట్టలో గుడిసెలు వేసిన 17 మందిపై బైండోవర్‌ కేసులు ఉపసంహరించాలి

  •  దోశపాడు నిర్బంధం, బద్వేలులో గుడిసెల కూల్చివేతపై ఖండన
  •  సిపిఎం రాష్ట్ర కమిటీ తీర్మానం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుపతి, ఎర్రగుట్టలో గుడిసెలు వేసిన 17 మంది పేదలపై అక్రమంగా పెట్టిన బైండోవర్‌ కేసులను ఉపసంహరించాలని, ఏలూరు జిల్లా దోశపాడులో పోలీసుల నిర్బంధం, కడప జిల్లా బద్వేలులో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం రెండోరోజు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు హాజరైన ఈ సమావేశం నిర్బంధాలు, పేదల గుడిసెల కూల్చివేతపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎర్రగుట్టలో గుడిసెలు వేసిన 17 మందిపై బైండోవర్‌ కేసులు పెట్టడం దుర్మార్గమని, వాటిని ఉపసంహరించాలని కోరారు. జగనన్న పట్టాలు పొందిన అర్హులైన పేదలకు స్థలాలివ్వాలని డిమాండ్‌ చేశారు. కరకంబాడీ పంచాయతీ సర్వే నెంబరు 153/1లో ఉన్న 125 ఎకరాల గుట్టను వైసిపి నాయకులు ఆక్రమించి గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారని, మరోవైపు జగనన్న ఇళ్లపట్టాలు పొందిన పేదలకు స్థలాలు చూపలేదని తెలిపారు. నాలుగేళ్లుగా స్థలాలు చూపని నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఎర్రగుట్ట మీద గుడిసెలు వేసుకున్నారని, ప్రత్యామ్నాయం చూపకుండా అధికారులు దుర్మార్గంగా పేదల గుడిసెలను తొలగించారని తీర్మానంలో పేర్కొన్నారు. స్థలాలు చూపాలని కూల్చివేసిన తర్వాత నెలరోజులుగా పేదలు అధికారుల చుట్టూ తిరిగారని, 2018లో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు మీద కూడా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. పేదలు మళ్లీ ఎక్కడ ఎర్రగుట్టలో గుడిసెలు వేస్తారో అనే అనుమానంతో 17 మంది సిపిఎం నాయకులు, పేదలను ఇళ్ల వద్ద తెల్లవారుజామున అరెస్టు చేసి రేణిగుంట, ఎయిర్‌పోర్టు స్టేషన్లకు తరలించారని తెలిపారు. అక్రమంగా పెట్టిన కేసులు ఉపసంహరించాలని, పేదలకు ఇంటిస్థలాలు చూపాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఏలూరు జిల్లా దోశపాడులో 120 ఎకరాలు దళితుల భూములను పెత్తందారులు ఆక్రమించుకున్నారని, రెవెన్యూ కోర్టులు పేదల భూములకు రక్షణ కల్పించాలని చెప్పినా అధికార పార్టీ నాయకులు వందలాదిమంది పోలీసులను తెచ్చి పేదలను తమ భూముల్లోకి రాకుండా అడ్డుకున్నారని తీర్మానంలో పేర్కొన్నారు. కడప జిల్లా బద్వేలు మూడు ప్రాంతాల్లో పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తుంటే రాత్రికి రాత్రి వాటిని కూల్చేశారని, పేదలకు సంబంధించి వంట సామానులు, దుస్తులు, సామగ్రి కాలిపోయాయని పేర్కొన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన అధికారులు, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️