బైక్‌పై మృతదేహం తరలింపు

Jan 17,2024 11:15 #bike, #dead body, #movement
  • విజయనగరం జిల్లాలో హృదయ విదారక ఘటన

ప్రజాశక్తి- శృంగవరపుకోట (విజయనగరం జిల్లా) : రోడ్డు సౌకర్యం లేకపోవడంతో మృతదేహాన్ని తొలుత మోటార్‌ సైకిల్‌పైనా, ఆ తర్వాత డోలీ మోతపైనా తరలించాల్సి వచ్చింది. విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం మూల బొడ్డవర పంచాయతీలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం… చిట్టెంపాడు గ్రామానికి చెందిన మాదల గంగమ్మ (27), ఆమె ఆరు నెలల చంటిబిడ్డ తీవ్ర అనారోగ్యం బారిన పడడంతో కుటుంబసభ్యులు ఈ నెల ఐదున డోలీపై ఏడు కిలోమీటర్లు మోసుకుంటూ బొడ్డవర వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి 108 వాహనంలో వైద్యం కోసం శృంగవరపుకోటలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం విశాఖ కెజిహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల ఏడున పాప చనిపోగా, గంగమ్మ మంగళవారం మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని ప్రయివేటు వాహనంలో బొడ్డవర వరకు తీసుకొచ్చి ఆస్పత్రి సిబ్బంది వదిలేశారు. అక్కడి నుంచి ఆమె భర్త గంగులు రెండు కిలోమీటర్ల దూరంలోని బొడ్డవర రైల్వే స్టేషన్‌ వరకు మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. ఆ తర్వాత డోలీపై ఏడు కిలోమీటర్లు గిరి శిఖర చిట్టెంపాడు గ్రామానికి తీసుకువెళ్లి దహన సంస్కారాలు నిర్వహించారు. కాగా, డోలీ మోతలపై గతంలో ‘ప్రజాశక్తి’లో వచ్చిన కథనాలకు జిల్లా కలెక్టర్‌ స్పందించి రహదారి నిర్మాణానికి రూ.పది కోట్లు మంజూరు చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు.

➡️