రాజమండ్రి పార్లమెంటు బరిలో బిజెపిని ఓడించండి

  • కూటమికి ఓటు వేసినా, వైసిపికి వేసినా మోడీకే
  • రాజ్యాంగ పరిరక్షణ సభలో వక్తలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : రాజమండ్రి పార్లమెంటు బరిలో బిజెపిని ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య పరిరక్షణ సభ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాల్లో సోమవారం జరిగింది. సిపిఐ, సిపిఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి.అరుణ్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించిన ఈ సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తన జీవితాంతం లౌకికవాదానికి, మత సామరస్యానికి, దేశ సమైక్యతకు, నిజాయితీగా కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. దేశంలో లౌకికవాదానికి తూట్లు పొడుస్తూ, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న బిజెపి తరఫున ఆయన కుమార్తె పురందేశ్వరి పోటీ చేయడం ఎన్‌టిఆర్‌ ఆశయాలకు తూట్లు పొడవడమేనని అన్నారు. ఎన్‌డిఎ కూటమికి, వైసిపికి విశ్వసనీయత లేదని విమర్శించారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఉభయ గోదావరి జిల్లాలు కొట్టుకుపోయే ప్రమాదం లేకపోలేదని, దీనికి టిడిపి, వైసిపి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. గిట్టుబాటు ధర లభించక ధాన్యం రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యలను, రాష్ట్ర ప్రయోజనాలను టిడిపి, వైసిపి పూర్తిగా విస్మరించాయని తెలిపారు. జైలుకు పోకుండా బెయిల్‌పై ఉండేందుకు బిజెపి పల్లకి మోయడమే చంద్రబాబు, జగన్‌ ప్రధాన అజెండాగా ఉందన్నారు. దేశ రాజకీయాలకు ఇండియా కూటమి దిక్సూచని తెలిపారు. సిపిఎం, సిపిఐ బలపర్చిన కాంగ్రెస్‌ పార్టీ ఎంపి, ఎంఎల్‌ఎ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

మోడీని ఇంటికి సాగనంపుదాం : కె రామకృష్ణ
ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీని ఇంటికి సాగనంపుదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. 2014లో అధికారంలోకొస్తే ప్రత్యేక హోదా, విభజన హామీలు, కడప స్టీల్‌ ఫ్యాక్టరీ, రాజధాని నిర్మాణంపై బిజెపి ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. నేడు మోడీ గ్యారెంటీ పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి నూతన మేనిఫెస్టో తీసుకొచ్చారని విమర్శించారు బిజెపి ప్రభుత్వం దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతోందన్నారు. రైతులు రుణమాఫీ అడిగితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని చెబుతోందని, కార్పొరేట్‌ సంస్థలకు మాత్రం లక్షల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తోందన్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకొస్తే ప్రత్యేక హోదా : గిడుగు రుద్రరాజు
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందని ఆ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు హామీ ఇచ్చారు. బిజెపిని వ్యతిరేకించడం వల్లనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ క్రేజీవాల్‌ను కేంద్ర ప్రభుత్వం జైల్లో పెట్టించిందన్నారు. బిజెపికి అనుకూలంగా లేని వారిపై ఇడి, సిబిఐ, ఐటి సంస్థలను ప్రయోగిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఓట్లు లేని బిజెపితో టిడిపి జతకట్టడం వెనక చాలా రహస్యం ఉందన్నారు. చంద్రబాబును జైల్లో పెట్టడం వల్లే బిజెపితో కలిశారని వివరించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ బిజెపిని గద్దె దించి రాజ్యాంగాన్ని కాపాడుకుందామన్నారు. ఈ సభలో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు జంగా గౌతమ్‌, ప్రముఖ రచయిత డివిఎస్‌.వర్మ, సిపిఐ, సిపిఎం జిల్లా నాయకులు పాల్గొన్నారు.

➡️