డిపాజిటర్ల పరిరక్షణ చట్టం లక్ష్యాలకు విఘాతం

Mar 30,2024 23:33 #ED, #enquiry

-అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ఇడి వైఖరిపై హైకోర్టు
– సిఐడి జప్తు చేసిన ఆస్తులనే మళ్లీ ఇడి జప్తు చేయడంపై ఆక్షేపణ
ప్రజాశక్తి, అమరావతి :ఆగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏపీ సిఐడి జప్తు చేసిన ఆస్తులనే ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్టర్‌ కూడా జప్తు చేయడానికి రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టింది. ఇడి జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులు ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్ట లక్ష్యాలను దెబ్బతీసే విధంగా ఉందని ప్రకటించింది. ఇడి జారీ చేసిన ప్రాథమిక జప్తు ఉత్తర్వులను కొట్టి వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ఇటీవల తీర్పు వెలువరించారు .
సిఐడి జప్తు ఉత్తర్వులు డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించేలా ఉన్నాయని హైకోర్టు గుర్తుచేసింది. మనీలాండరింగ్‌ చట్టం కింద అడ్డుడికేటింగ్‌ అథారిటీ వద్దకు వెళ్లి తేల్చుకోవడం డిపాజిటర్లకు చాలా కష్టమని చెప్పింది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద ఏర్పాటైన ఏలూరులోని ప్రత్యేక కోర్టే ఈ వ్యవహారాన్ని తేల్చడం డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుందని పేర్కొంది. అగ్రిగోల్డ్‌ ఆస్తులను సిఐడి జప్తు చేయడాన్ని ప్రత్యేక కోర్టు సమర్ధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను ఆమోదించింది. అగ్రిగోల్డ్‌ స్కాం దర్యాప్తు కొనసాగించుకోవచ్చునని ఇడికి తేల్చి చెప్పింది.
జప్తు చేసిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లందరికీ సమానంగా పంచే అధికారాన్ని ప్రత్యేక కోర్టుకు డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కల్పిస్తోంది. డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 6లో ఉన్న ఏ నిబంధన కూడా మనీలాండరింగ్‌ చట్టం సెక్షన్‌ 5లో లేదు. జప్తు చేసిన ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను డిపాజిటర్లకు సమానంగా పంపిణీ చేయాలన్న నిబంధన ఏదీ మనీలాండరింగ్‌ చట్టంలో లేదు.. అని తీర్పుల పేర్కొంది.
ఇడి జప్తు ఉత్తర్వులపై పిటిషన్లు, అగ్రిగోల్డ్‌ యాజమాన్య ఆస్తులను జప్తు చేస్తూ ఇడి జారీ చేసిన తాత్కాలిక జప్తు ఉత్తర్వులను ఆల్‌ ఇండియా అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్టర్‌ జారీచేసిన జంతువులను మరికొన్ని కంపెనీలు వ్యక్తులు కూడా హైకోర్టులో వేరువేరుగా సవాల్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ కు చెందిన ఆస్తులను తాము కొనుగోలు చేసిన తర్వాత వాటిని ఇడి జప్తు చేయడం చట్ట వ్యతిరేకమని వీరి వాదన. తాము కొనుగోలు చేసిన భూముల్లో నిర్మించిన అపార్ట్మెంట్లను కూడా జత్తు చేయడానికి ఆక్షేపించింది.
సిఐడి తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌. శ్రీరామ్‌, ఇడి తరఫున సీనియర్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ జోశ్యుల భాస్కరరావు, పిటిషనర్ల తరఫున పీఎస్పీ సురేష్‌ కుమార్‌. పూజారి నరహరి, సన్నపురెడ్డి వివేక్‌ చంద్రశేఖర్‌ వాదించారు

➡️