తెలంగాణలో ‘రైతుబంధు’కు ఇసి బ్రేక్‌

Nov 27,2023 22:04 #Assembly Elections, #Telangana
  • కోడ్‌ ముగిసేవరకు నిధులు విడుదల చేయవద్దని ఆదేశం

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు మూడు రోజుల ముందు కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) కీలక నిర్ణయం తీసుకుంది. ‘రైతు బంధు’ సాయం పంపిణీకి రెండు రోజుల క్రితం ఇచ్చిన అనుమతిని సోమవారం ఉపసంహరించుకుంది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగిసేవరకు నిధులు విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు సిఇసి ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 28లోపు రైతుబంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఇసి అనుమతి ఇచ్చింది. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో మంత్రి హరీశ్‌ రావు నియమాలను ఉల్లంఘించినందున ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఎన్నికల ప్రచార సభల్లో రైతుబంధు గురించి ప్రస్తావించరాదని, లబ్ధి పొందేలా వ్యాఖ్యలు చేయొద్దని ముందే ఇసి షరతు విధించింది. అయితే, రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ తాజాగా ఇసి అనుమతి రద్దు చేసింది. దీంతో, రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు ‘రైతుబంధు’ సాయం నిలిచిపోయింది. దీనిపై కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పరస్పర విమర్శలకు దిగాయి. కాంగ్రెస్‌ ఫిర్యాదు మేరకే రైతుబంధు పంపిణీ ఆగిందని బిఆర్‌ఎస్‌ ఆరోపిస్తోంది. హరీశ్‌రావు వ్యాఖ్యల వల్లే ఇసి నిలిపివేసిందని, తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్‌ కౌంటర్‌ ఇస్తోంది.

➡️