తెలంగాణలో ‘రైతు భరోసా’కు ఇసి తాత్కాలిక బ్రేక్‌

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం ఆదేశించింది. రైతు భరోసా చెల్లింపులలో సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఇసికి హైదరాబాద్‌కు చెందిన ఎన్‌.వేణుకుమార్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఇసి… ముఖ్యమంత్రి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. ఐదు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను సోమవారం విడుదల చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ చేపట్టింది. దాదాపు రూ.2 వేల కోట్లకుపైగా నిధులు విడుదల చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావించగా, ఇసి ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది.

➡️