కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి 

farmers rural bandh against modi govt tadepalli

డి రమాదేవి, ఆంధ్రప్రదేశ్ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
వడ్డేశ్వరం జాతీయ రహదారి వద్ద ప్రజా సంఘాల రాస్తారోకో
ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : నిరంకుశత్వంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఆంధ్రప్రదేశ్ ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి రమాదేవి అన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలం, కొలనుకొండ జాతీయ రహదారి వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాలు తలపెట్టిన రైతాంగ,పారిశ్రామిక కార్మిక బంద్ సందర్భంగా రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన, మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ బిల్లు రద్దు చేయాలని, దేశ సరిహద్దులో రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ, నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని ఆమె విమర్శించారు. ఈనెల 13వ తేదీ నుండి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, రైతులు, కార్మికులు, కార్మిక సంఘాలు గ్రామీణ పారిశ్రామిక బందుకు పిలుపునిచ్చాయని ఆమె తెలిపారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతన చట్ట ప్రకారం 26 వేలు వేతనం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, కనీస మద్దతు ధర చట్టం చేయాలని , కార్మికుల హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న, రైతుల పై, కార్మికుల పై దేశ సరిహద్దులో రణరంగం మాదిరిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రబ్బర్ బుల్లెట్ గుల్ల వర్షం కురిపిస్తూ, బాష్ప వాయువు ప్రయోగిస్తూ, రైతులను, కార్మికులను నిర్బంధిస్తుందని ఆమె అన్నారు. ఇప్పటికే 60 మంది రైతులు గాయాల పాలయ్యారని అన్నారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా, రవాణా రంగ కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తుందని ఆమె అన్నారు. ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని తీసుకురావడం దుర్మార్గమన్నారు. ఒకవైపున స్వామినాథన్ కు అవార్డు ఇస్తూనే, మరోవైపున స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయడానికి పూనుకోని, దుర్మార్గపు పరిపాలనను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆమె దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా, కార్మికులకు కనీస వేతన చట్ట ప్రకారం వేతనాలు ఇవ్వకుండా , కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తూ, మా ప్రభుత్వం అచ్చేదీన్ అని భీరాలు పలుకుతుందని ఆమె అన్నారు. దుర్మార్గపు బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్మికులు, కర్షకులు ఐక్యంగా కలిసి రావాలని ఆమె కోరారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వంకాయలపాటి శివ నాగరాణి మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయకుండా, వ్యవసాయ కార్మికులు ఉపాధి కార్మికుల పొట్ట కొట్టేందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమె అన్నారు. దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ పనులను నిలిపివేస్తూ, ఉపాధి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆమె మండిపడ్డారు. ఉపాధి కార్మికులకు 200 రోజులు పని దినాలు కల్పిస్తూ, రోజువారి వేతనం 600 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకరరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటానని నమ్మ బలికిందని ఆయన అన్నారు. తక్షణమే వ్యవసాయ రంగాన్ని, రైతులను దివాలా తీసే, మూడు నల్ల చట్టాలను రద్దుచేసి, రైతుల పండించిన పంటలకు, మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టే ప్రక్రియను ఆపాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అప్పలస్వామి, నాయకులు కాట్రగడ్డ శివన్నారాయణ, అమ్మిశెట్టి రామారావు, కంచర్ల జేమ్స్, సిఐటియు నాయకులు గోపాలం శంకర్రావు, మేకల డేవిడ్, చొక్కా మరియదాస్, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు , కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

➡️