వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు

Apr 2,2024 22:05 #fishermen, #visaka

ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం) :విజయనగరం జిల్లా భోగాపురం మండం ముక్కాం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు విశాఖ తీరంలో వేటకు వెళ్లి గల్లంతయ్యారు. సోమవారం మధ్యాహ్నం వేటకు వెళ్లిన వీరంతా తిరిగి రాకపోవడంతోపాటు ఫోన్లు కూడా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. నేవీ సిబ్బంది, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. ముక్కాం గ్రామానికి చెందిన కారి గరగయ్యకు విశాఖ జెట్టీలో వేటకు వెళ్లేందుకు బోటు ఉంది. అందులో సోమవారం మధ్యాహ్నం ఎప్పటి మాదిరిగానే గరగయ్యతో పాటు ఆయన కుమారుడు చిన్నారావు, కారి నరేంద్ర, వాసుపల్లి అప్పన్న, పొడుగు అప్పన్న, మైలపల్లి మహేష్‌ కూడా వెళ్లారు. వేటకు వెళ్లిన వీరంతా తిరిగి ఒడ్డుకు చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గాలుల తీవ్రతకు సముద్రంలో బోటు బోల్తా పడినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం బోటు విశాఖ తీరంలో ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. నేవీ అధికారులు హెలికాఫ్టర్‌, నౌకల సాయంతో మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారుల గల్లంతుతో ముక్కాం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గల్లంతైన వారి పేర్లు
1. కారి చిన్నారావు
2. వాసుపల్లి అప్పన్న
3. కారి చిన్న సత్తయ్య
4. కారి నరేంద్ర
5. వాసుపల్లి పొడుగు అప్పన్న
6. మైలపల్లి మహేష్‌

➡️