ప్రభుత్వ సిఫార్సు బదిలీలు రద్దు చేయాలి : యుటిఎఫ్‌ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయుల పోరాటాల ద్వారా సాధించుకున్న కౌన్సెలింగ్‌ విధానాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వమే సిఫార్సు బదిలీలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు యుటిఎఫ్‌ వెల్లడించింది. ఈ బదిలీలను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని ఫెడరేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఈ విధంగా సిఫార్సు బదిలీలు చేయడం వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందా? అని ప్రశ్నించారు. మున్సిపల్‌ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, హిందీ, తెలుగు పండిట్ల ప్రమోషన్లు, వివిధ జిల్లాల్లో పెండింగ్‌లో ప్రమోషన్లు ఇవ్వటానికి నిబంధనలు ఆటంకంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌తో సంబంధం లేకుండా సిఫార్సు బదిలీలు చేయడానికి ఏ నిబంధనలూ ఆటంకం కావడం లేదా? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయుల కోరిక మేరకే బదిలీలు చేస్తున్నామన్న ప్రభుత్వం, అదే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు వద్దని చెబుతున్న జిఓ 117, అప్రెంటీస్‌ విధానాన్ని ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. సుమారు 1200పైగా ప్రభుత్వం ఇలాంటి బదిలీలు చేయడం విద్యారంగానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిగే కౌన్సెలింగ్‌ విధానానికి తూట్లు పొడిచే ఈ బదిలీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
సీల్డ్‌ కవర్‌ బదిలీలు ఆపాలని బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ మరో ప్రకటనలో డిమాండ్‌ చేసింది. అక్రమ బదిలీలు జరగడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చిట్టేటి రమేష్‌ పేర్కొన్నారు.

➡️