పాడేరు ఏజెన్సీలో భారీ వర్షం

  • తెలంగాణలో వడగళ్ల వాన, గాలి బీభత్సం
  • పంటలకు తీవ్ర నష్టం

ప్రజాశక్తి- యంత్రాంగం : రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో శనివారం భారీ వర్షం కురిసింది. తెలంగాణలో వడగళ్ల వాన, ఈదురుగాలుల బీభత్సంతో పంటలకు నష్టం వాటిల్లింది. రోడ్లపై చెట్లు కూలాయి. పాడేరు పట్టణంలో గంటకుపైగా ఉరుములు, మెరుపులతో వాన కురవడంతో పలుచోట్ల నీరు చేరింది. హోరుగాలి వీచింది. ఏప్రిల్‌ నెలల్లో పాడేరు ఏజెన్సీలో ఈదురుగాలులతో వర్షం కురవడం సాధారణమే. అయితే, ఈ ఏడాది అంతగా వానలు కురవలేదు. శనివారం పడిన వర్షమే ఈ ఏడాది తొలి పెద్ద వర్షమని ప్రజలు చెప్పుకుంటున్నారు. వేసవి దుక్కులకు ఈ వర్షాలు ఉపకరిస్తాయని రైతులు అంటున్నారు. జి.మాడుగుల, అనంతగిరి మండల కేంద్రాలతోపాటు పలు గ్రామాల్లోనూ భారీ వర్షం కురిసింది. పది రోజులుగా ఎండల తీవ్రత అధికమై ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. చల్లని గాలులకు ప్రజలు సేదతీరారు.


తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వడగళ్ల వాన పడింది. హైదరాబాద్‌లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నిజామాబాద్‌ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలో వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు 40 నిమిషాలపాటు బలమైన ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షంతో వరి, జొన్న, నువ్వు పంటలు నేలవాలాయి. కళ్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ప్లాస్టిక్‌ కవర్లను కప్పి ఉంచినప్పటికీ ఈదురు గాలులకు, వర్షానికి అవి ఎగిరిపోవడం, కొట్టుకుపోవడం, తడిచిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల చెట్లు వేర్లతో సహా రోడ్లకడ్డంగా కూలిపోయాయి. వరి పంటకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో రైతులు వాపోతున్నారు. మెండోరా మండలంలో నువ్వు, వరి పంటలు నేలకొరిగాయి. వడగాల్పులు, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న హైదరాబాద్‌ నగరవాసులకు వర్షం కాస్త ఊరటనిచ్చింది. ఈ నెల 22, 23 తేదీల్లో తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి అధికారులు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.

➡️