విశాఖ పోర్టుకు అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌక

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :విశాఖ టెర్మినల్‌కు మొట్టమొదటి సారిగా అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌక వచ్చింది. లక్సరీ విభాగానికి చెందిన ‘ది వరల్డ్‌’ క్రూయిజ్‌ నౌక ఆదివారం విశాఖ తూర్పు తీరానికి విచ్చేసింది. తూర్పు తీరంలో అంతర్జాతీయ క్రూయిజ్‌ నౌకలకు విశాఖపట్నం క్రూయిజ్‌ టెర్మినల్‌ను గమ్యస్థానంగా మార్చుతామనే తమ విధానానికి ఇది నిదర్శనమని పోర్టు అధికారులు వెల్లడించారు. విశాఖలోని టెర్మినల్‌ను రూ.96 కోట్లతో క్రూయిజ్‌ షిప్పుల రాకపోకలకు అనువుగా నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అద్భుతమైన అతిథ్యానికి మారుపేరైన ‘ది వరల్డ్‌’ నౌకలో ప్రపంచ నలుమూలల నుంచీ పర్యాటకులు విశాఖకు వచ్చారు. వీరంతా విశాఖ చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను, ప్రకృతి రమణీయతను చూసేందుకు ఉత్సాహం చూపారు. పర్యాటకులకు క్రూయిజ్‌ టెర్మినల్‌లో సాదర స్వాగతం పలికినట్టు విశాఖ పోర్టు చైర్మన్‌ డాక్టర్‌ ఎం.అంగముత్తు వెల్లడించారు. దేశంలోని ఇతర పోర్టులతో పోల్చుకుంటే ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియను విశాఖపట్నం పోర్టు 45 నిమిషాలలోపే పూర్తి చేయడంపై షిప్‌ కెప్టెన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం అందించిన సహకారానికి పోర్టు యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

➡️