జగన్‌వి కుల, మత రాజకీయాలు :  టిడిపి అధినేత చంద్రబాబు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కోడికత్తి డ్రామా నుంచి బాబాయి హత్య వరకూ అన్ని అస్త్రాలూ ఉపయోగించిన జగన్‌ ఇప్పుడు కుల, మత రాజకీయాలు చేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్‌ షిబ్లీతో పాటు పలువురు ముస్లిం సంఘాల నేతలు చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో సోమవారం కలిశారు. జనసేనతో పొత్తు సమయంలో కుల రాజకీయం చేసి బోల్తాపడ్డ జగన్‌ అండ్‌ టీం ఇప్పుడు తాము బిజెపితో పొత్తు అనంతరం మత రాజకీయానికి తెరతీసిందని చంద్రబాబు ఆరోపించారు. టిడిపి, బిజెపి పొత్తుతో ముస్లిం మైనార్టీలకు నష్టం అంటూ వైసిపి తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ముస్లిం సంఘాల నేతలు కూడా వైసిపి మత రాజకీయాలను ఎండగట్టాలని అన్నారు. ముస్లిములపై జగన్‌కు నిజంగా ప్రేముంటే రంజాన్‌ మాసంలో రంజాన్‌ తోఫా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దుల్హన్‌ పథకం, దుకాన్‌ మాకాన్‌ సహా పది సంక్షేమ పథకాలను రద్దు చేశారని విమర్శించారు. తమ హయాంలో కడపలో 90 శాతం పూర్తిచేసిన హజ్‌ హౌస్‌ను కూడా పూర్తిచేయలేకపోయిన జగన్‌కు మైనార్టీల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ముస్లిముల ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల్లో రాజీ ఉండదని అన్నారు. సమావేశం అనంతరం ఫారూక్‌ షిబ్లీ మాట్లాడుతూ.. త్వరలో ముస్లిం డిక్లరేషన్‌ ఏర్పాటుచేసి పూర్తి భరోసా కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో టిడిపి మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్ధన్‌ పాల్గొన్నారు.

➡️