కాకినాడలో ‘జైల్‌ భరో’ : నేతలు అరెస్ట్‌

Jan 9,2024 12:39 #Jail Bharo, #Kakinada, #tension

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : అంగన్వాడీలపై ఎస్మా ఉపసంహరించుకొని, వారి డిమాండ్లను, సర్వ శిక్ష అభియాన్‌ ఉద్యోగులు, మున్సిపల్‌ వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ నగరంలో మంగళవారం అఖిలపక్షం నాయకులు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు జైల్‌ భరో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఈ కార్యక్రమంతో కొంతసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తొలిత అంబేద్కర్‌ విగ్రహం నుంచి సీపీఎం,టీడీపీ, ఆమ్‌ ఆద్మీ, న్యూ డెమొక్రసీ తదితర పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు కలెక్టరేట్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు, సర్వ శిక్ష అభియాన్‌, మున్సిపల్‌ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి విడిచి పెట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టరేట్లోకి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. కలెక్టరేట్‌ గేటును తోసుకుంటూ ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకుని నాయకులను అరెస్టు చేశారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ రాజశేఖర్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శేష బాబ్జి,సిహెచ్‌ రాజకుమార్‌,జిల్లా నాయకులు డి.క్రాంతి కుమార్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈశ్వరరావు, కె.ఎస్‌ శ్రీనివాస్‌, ఐద్వా నాయకురాలు సిహెచ్‌. రమణి, మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈశ్వరి తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు. 16 మందిని అరెస్టు చేసి రెండవ పట్టణ పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారు.

➡️