రోడ్డెక్కిన గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతులు..

  • పేరంపేట- పంగిడిగూడెం మధ్యలో అండర్‌ పాస్‌ వద్ద రైతులు ధర్నా..
  • పనులు అడ్డుకున్న రైతులు
  • రైతులకు న్యాయం చేయకపోతే పోరాటం ఉధతం చేస్తామని హెచ్చరిక

ప్రజాశక్తి-ఏలూరు : గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతులు రోడ్డెక్కారు. జంగారెడ్డిగూడెం మండలం పెరంపేట- పంగిడిగూడెం మధ్యలో గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే అండర్‌ పాస్‌ వద్ద టెంటు వేసి పనులు అడ్డుకొని రైతులు ధర్నా నిర్వహించారు. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి హైవే పనులు అడ్డుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా రైతులు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూ నిర్వాసిత రైతులు తమకు న్యాయమైన పరిహారం ఇవ్వాలంటూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. రైతులకు అతి తక్కువ పరిహారం ఇచ్చి బలవంతంగా భూములు లాక్కోవడం దారుణమని విమర్శించారు. ఆర్బిట్రేషన్‌ ద్వారా పరిహారం పెంచి ఇస్తామని జిల్లా కలెక్టర్‌ హామీ ఇచ్చి విచారణ పూర్తి అయినా ఆర్బిట్రేషన్‌ జడ్జిమెంట్స్‌ ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఆర్బిట్రేషన్‌ జడ్జిమెంట్స్‌ ఇచ్చి రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. హైవే పనులు వల్ల దుమ్ము ధూళితో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. నిర్వాసిత రైతులకు జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. బోర్లు కోల్పోయిన వారికి వెంటనే జలకళ పథకంలో బోర్లు వేయాలని కోరారు. సర్వీస్‌ రోడ్లు ప్రొవిజన్‌ కల్పించాలని సర్వీస్‌ రోడ్లు బీటీ రోడ్లుగా నిర్మాణం చేయాలని డిమాండ్‌ చేశారు. భూమి ఒకవైపు బోర్‌ ఒక వైపు ఉన్న రైతులకు హైవే కింద నుండి ప్లాస్టిక్‌ పైపులు అమర్చాలని కోరారు. తగినంత ఎత్తులో అండర్‌ పాస్‌లు నిర్మాణం చేయాలన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉదతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనకు టిడిపి చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్‌,రావూరి కష్ణ పెనుమర్తి రామ్‌ కుమార్‌ రైతులు ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, గ్రీన్‌ ఫీల్డ్‌ భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ నాయకులు గోలి నర్సిరెడ్డి, వందనపు సాయిబాబా,పి.సోమిరెడ్డి,పి. సత్తిరెడ్డి, గూడపాటి శ్రీనివాసరావు, పరిమి రామారావు, ఆలపాటి మురళి, కొట్టు కనక నరసింహారావు, పుసులూరి శ్రీహరి, పల్లి వెంకటరామారావు, అందుగుల మోహన రావు,మాండ్రు సూర్యచంద్రం తదితరులు పాల్గొన్నారు.

➡️