స్టీల్‌ప్లాంట్‌ గెస్ట్‌హౌస్‌ల లీజ్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలి

  • సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు డిమాండ్‌

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉక్కు హౌస్‌, గంగవరం గెస్ట్‌ హౌస్‌లను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చేందుకు స్టీల్‌ప్లాంట్‌ ద్వారా జారీచేసిన నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. మోడీ అనుకూల కార్పొరేట్లకు కట్టబెట్టాలన్న కుట్రలను బిజెపి ప్రభుత్వం వేగవంతం చేస్తోందని పేర్కొన్నారు. తాజాగా 116 గదులు, బ్యాంకెట్‌ హాళ్లు, రెస్టారెంట్లతో కూడిన ఉక్కు గెస్ట్‌ హౌస్‌ను, గంగవరం కొండపై ఉన్న గెస్ట్‌హౌస్‌ను దీర్ఘకాలిక లీజు పేరుతో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు సిద్ధపడిందన్నారు. ప్లాంటుకు నగరంలోని హెచ్‌బి.కాలనీ తదితర ప్రాంతాలలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూములను అమ్మకానికి పెట్టిందని తెలిపారు. మూడేళ్లుగా స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, విశాఖపట్నం ప్రజలు చేస్తున్న పోరాటానికి జడిసి, ప్లాంట్‌ మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా ప్రైవేటుకు కట్టబెడుతోందని విమర్శించారు.
సుమారు 500 మెగావాట్ల సొంత విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు బ్రాయిలర్‌ కోల్‌, రైల్వే రేకులు ఇవ్వకుండా బిజెపి ప్రభుత్వం ప్లాంట్‌ను చీకట్లోకి నెట్టేందుకు పూనుకుందని విమర్శించారు. కార్మికుల అభీష్టానికి వ్యతిరేకంగా జిందాల్‌ సంస్థను ప్లాంట్‌లోకి అనుమతించిందని తెలిపారు. ఉద్యోగులకు, కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వీరందరినీ ఆర్థికంగా దెబ్బతీస్తోందని విమర్శించారు. ఇలా అనేక రూపాల్లో స్టీల్‌ప్లాంట్‌ను, కార్మికులను దెబ్బతీసే కుట్రలు బిజెపి ప్రభుత్వం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. కేంద్రాన్ని నిలదీసి స్టీల్‌ప్లాంట్‌ను, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన వైసిపి ప్రభుత్వం.. కరెంట్‌ బిల్లులు చెల్లించకపోతే ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఎపిఇపిడిసిఎల్‌ ద్వారా బెదిరించడం దుర్మార్గం అని పేర్కొన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం బిజెపితో కలిసి గాజువాక, విశాఖపట్నం ప్రజలకు, స్టీల్‌ప్లాంట్‌ కార్మిక వర్గానికి, నిర్వాసితులకు తీవ్ర ద్రోహం చేస్తున్నాయని, వీరి ప్రజా ద్రోహాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు.

➡️