ప్రధాని పర్యటన నేపథ్యంలో పలువురు గృహ నిర్బంధం

– కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు పద్మశ్రీ, అమరావతి బహుజన జెఎసి నేత బాలకోటయ్య హౌస్‌ అరెస్టు
నిర్బంధాన్ని ధిక్కరించి ఇండియా వేదిక సభకు వచ్చిన పద్మశ్రీ
ప్రజాశక్తి – విజయవాడ, కంచికచర్ల :ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌ రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, రాజధాని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్యతోపాటు పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామంలోని స్వగృహం నుంచి పద్మశ్రీని బయటకు రాకుండా మంగళవారం ఉదయం నుంచి ఆమె ఇంటి వద్దే ఉన్నారు. ”మీరు ఇంట్లో నుండి బయటకు వెళ్లడానికి వీల్లేదు’ అని చెప్పి నిర్బంధించారు. ‘మీరేం చేసుకుంటారో చేసుకోండి, బుధవారం గన్నవరంలో జరిగే ఇండియా వేదిక సభ వద్దకు వెళ్తా, లేదంటే మీ పోలీస్‌స్టేషన్‌ ముందే కూర్చొని దీక్ష చేస్తా’ అని పద్మశ్రీ తెగేసి చెప్పారు. దీంతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను ఆమెతోపాటు గన్నవరం మండలం దావాజీగూడెంలో జరిగిన ఇండియా వేదిక సభకు పంపారు. మహిళ పోలీసులతోపాటు మగ పోలీసులు కూడా ఉన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లా కంచికచర్లలో నివాసం ఉంటున్న రాజధాని అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాల కోటయ్యను బుధవారం తెల్లవారుజాము నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు. దళిత నేత అయిన బాలకోటయ్యను అరెస్టు చేయడం పట్ల పలువురు బహుజన జెఎసి నేతలు ఖండించారు. సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఈ రాష్ట్రం, దేశం కోసం పోరాడుతూనే ఉంటానన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రధాని మోడీ ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. బాల కోలయ్య మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణంలో తీవ్రంగా మోసం చేసిన ప్రధాని మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

➡️