మిమ్స్‌ ఉద్యోగుల హక్కులు కాలరాయడం తగదు – సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వైవి

Feb 10,2024 21:41 #CITU, #cpm leaders, #cpm protest
nellimarla mims hospital workers protest

ప్రజాశక్తి-నెల్లిమర్లమిమ్స్‌ :యాజమాన్యం ఆ సంస్థ ఉద్యోగులు, కార్మికుల హక్కులు కాలరాయడం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా నెల్లిమర్ల వద్ద మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న నిరసన శిబిరాన్ని వెంకటేశ్వర రావు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికుల సమస్యలను యాజమాన్యం పరిష్కరించాలని కోరితే సస్పెండ్‌, బ్లాక్‌ మెయిల్‌ చేయడం వంటి కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదన్నారు. ఉద్యోగులకు ఏడు డిఎలు చెల్లించలేదు సరికదా నాలుగేళ్ల నుంచి వేతన ఒప్పందం చేయకపోవడం దుర్మార్గమన్నారు. యాజమాన్యం మొండి వైఖరితో ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే కార్మికశాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. యాజమాన్యం మొండి పట్టుదల వీడి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అన్ని వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహకరించి మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. శిబిరాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి రామ్మోహన్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్‌ వెంకటేష్‌, డి రాము, కెవిపిఎస్‌ నాయకులు ఆర్‌ ఆనంద్‌ తదితరులు సందర్శించి సంఘీభావం తెలిపారు. శిబిరంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్య నారాయణ, మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ, సిఐటియు నాయకులు కిల్లంపల్లి రామారావు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.

➡️