అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తెస్తాం : లోకేశ్‌

అమరావతి : టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి రాగానే పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. మైనింగ్‌ విభాగంపై విచారణ కమిటీ వేస్తామన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ రెసిడెన్సీలో స్థానికులతో లోకేశ్‌ సమావేశమై మాట్లాడారు. కేంద్ర హోంశాఖ లోకేశ్‌కు జెడ్‌ కేటగిరీ భద్రత కల్పించిన నేపథ్యంలో ఈ సమావేశానికి సీఆర్పీఎఫ్‌ (వీఐపీ వింగ్‌) సిబ్బంది ఆయన వెంట వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ … వైసిపి ప్రభుత్వం ఐదేళ్లలో తొమిదిసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచిందన్నారు. ఇంటి పన్ను, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తాము తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ మద్య నియంత్రణ పాలసీని తీసుకొస్తామని, వ్యవసాయ ఆధారిత ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. సిఎం జగన్‌ రాజకీయాలు వదిలి సినిమాల్లోకి వస్తే ఆస్కార్‌తో పాటు భాస్కర్‌ అవార్డులు వస్తాయని ఎద్దేవా చేశారు. సొంత బాబాయిని హత్య చేసి ఆ నెపాన్ని కుటుంబ సభ్యులపై వేసిన మహానటుడని విమర్శించారు.

➡️