అమరావతి రైతు దీక్షలకు విరామం

ప్రజాశక్తి – తుళ్లూరు : రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తున్న దీక్షలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి, పోలీసుల సూచన మేరకు రైతులు దీక్షలను నిలిపివేశారు. ఈ మేరకు అమరావతి రైతు ఐక్య కార్యాచరణ సమితి (జెఎసి), సమన్వయ కమిటీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశాయి.

ఇళ్ళ వద్ద నిరసనలు.. 
ఎన్నికల నియమావళి, పోలీసుల సూచన మేరకు రాజధాని గ్రామాల్లోని రైతు దీక్షా శిబిరాల్లో ఆందోళనలకు తాత్కాలికంగా బ్రేక్ పడడంతో మంగళవారం నుంచి ఇళ్ళ వద్దనే నిరసనలు కొనసాగించాలని రైతు జెఎసి, సమన్వయ కమిటీ నిర్ణయించాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా గతంలో ఇళ్ళ వద్ద దీక్షలు చేసిన మాదిరి గానే ఆందోళనలు, అమరావతి వెలుగు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని రైతు సంఘాలు వెల్లడించాయి. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధాని గ్రామాల్లో రైతులు, రైతు కూలీలు, మహిళలు దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, తుళ్లూరు, నెక్కల్లు, అనంతవరం రైతు దీక్షా శిబిరాలలో దీక్షలు  సాగుతున్నాయి. సోమవారంతో దీక్షలు 1560వ రోజుకు చేరగా ఎన్నికల నేపథ్యంలో శిబిరాల్లో దీక్షలకు రైతు సంఘాలు తాత్కాలికంగా విరామం ప్రకటించాయి.

➡️