రేషన్‌ బియ్యం మాఫియాకు అడ్డాగా కాకినాడ

– పోర్టు ద్వారా ఎగుమతులు
– మంత్రి నాదెండ్ల మనోహర్‌
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి :రేషన్‌ బియ్యం మాఫియాకు కాకినాడ అడ్డాగా మారిందని, పోర్టు నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. కాకినాడ పోర్ట్‌ కేంద్రంగా సాగిన రేషన్‌ ఎగుమతులపై సిఐడి విచారణకు అప్పగిస్తామని అన్నారు. కాకినాడ పోర్టు ఏరియాలో ఉన్న అశోక ఇంటర్నేషనల్‌ గోదాము, హెచ్‌ఒన్‌ బియ్యం గోదాములను, లాంగర్‌ రేవు యాంకరేజ్‌ పోర్టులో ఎగుమతి అవుతున్న బియ్యాన్ని ఆయన శనివారం తనిఖీ చేశారు. గోదాముల్లోని నిల్వలపై స్టాక్‌ రిజిస్టర్‌ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో బయటపడిన 5,800 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. రేషన్‌ మాఫియా అక్రమాలపై సిఐడి విచారణ కోరతామన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనలో తొలిరోజు నిర్వహించిన తనిఖీల్లో 7,615 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీజ్‌ చేశామని తెలిపారు. లావన్‌ ఇంటర్నేషనల్‌, అయ్యప్ప ఎక్స్‌పోర్ట్‌, విశ్వ ప్రియా, సార్టెక్స్‌ ఇండియా, సరళా ఫుడ్స్‌, విఎస్‌.రాజు సన్స్‌ గోదాముల్లో పిడిఎస్‌ బియ్యానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు దొరకాయన్నారు. రెండో రోజు తనిఖీల్లో పేదలకు అందాల్సిన బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికన్‌ దేశాలకు ఎగుమతి చేస్తూ భారీ అవినితికి పాల్పడ్డుతున్నట్లు వెల్లడైందన్నారు. మిగిలిన గోదాములను తనిఖీ చేసి పిడిఎస్‌ బియ్యాన్ని అక్రమంగా రీసైక్లింగ్‌ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1600 కోట్ల మొత్తంలో రూ.1000 కోట్లను రానున్న నాలుగు రోజుల్లో రైతుల ఖాతాలకు జమ చేయనున్నామని తెలిపారు.

➡️