ఎంపిగా గెలిస్తే ఉక్కు ప్రైవేటీకరణ అడ్డుకుంటాం – కాంగ్రెస్‌ విశాఖ ఎంపి అభ్యర్థి సత్యారెడ్డి

ప్రజాశక్తి – విశాఖ కలెక్టరేట్‌ (విశాఖపట్నం):తాను ఎంపిగా గెలిస్తే వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకుంటానని కాంగ్రెస్‌ విశాఖ ఎంపి అభ్యర్థి పులుసు సత్యనారాయణరెడ్డి (సత్యారెడ్డి) అన్నారు. ఇండియా వేదిక తరఫున మంగళవారం ఆయన నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ ర్యాలీలో కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ కార్యకర్తలు పాల్గన్నారు. అనంతరం మీడియాతో సత్యారెడ్డి మాట్లాడుతూ.. సిపిఎం, సిపిఐ, ఆప్‌ తదితర పార్టీలతో కలిసి ఇండియా వేదికగా తాము ఏర్పడి ఎన్నికలను ఎదుర్కొంటున్నామని చెప్పారు. సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు, సిపిఐ విశాఖ పశ్చిమ అభ్యర్థి ఎ.విమలతో పాటు మిగిలిన ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.జగ్గునాయుడు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి, ఆ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎ.విమల, సిపిఎం జిల్లా నాయకులు ఎం.సుబ్బారావు, వై.రాజు పాల్గొన్నారు.

➡️