కేంద్రం గుప్పిట్లోకే 

Jan 18,2024 10:26 #Irrigation Projects
srisailam sagar project in central govt
  • శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులపై ఆదేశాలు

ప్రజాశక్తి-యంత్రాంగం : కృష్ణా నదిపై కీలక ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను కేంద్రం గుప్పిట్లోకి తీసుకుంది. తన కన్నుసన్నల్లో నడిచే కృష్ణా నది నిర్వహణ బోర్డు (కెఆర్‌ఎంబి)కు ప్రాజెక్టులను అప్పగించాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. నెలరోజుల్లోగా ఈ ప్రక్రియ ముగియాలని ఆదేశించింది. ఈ రెండు ప్రాజెక్టులను కేంద్ర బలగాల భద్రతలోనే వుంచాలని పేర్కొంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించి వారంలోపు మార్గదర్శకాలను తయారు చేయాలని త్రిసభ్య కమిటిని ఆయన ఆదేశించారు. నాగార్జున సాగర్‌ నిర్వహణపై రెండు రాష్ట్రాల మద్య నవంబర్‌ 30న తలెత్తిన వివాదం నేపథ్యంలో కేంద్ర హోమ్‌ శాఖ ఆదేశాల మేరకు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రెండు ప్రాజెక్టుల నిర్వహణ, నియంత్రణ అంశాలపై మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ఇంజనీర్లు తమతమ అభిప్రాయాలను కేంద్ర కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ ముందు వ్యక్తం చేశారు. అనంతరం ముఖర్జీ మాట్లాడుతూ ఇకపై రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ వివాదాలకు ముగింపు పలికేలా ప్రాజెక్టుల నియంత్రణ అంతా బోర్డు చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టును కేంద్ర నియంత్రణలోకి తీసుకోవాలని ఏపి కోరగా. శ్రీశైలం ప్రాజెక్టును కేంద్రం నిర్వహించాలని తెలంగాణ డిమాండ్‌ చేసింది. దీంతో రెండు ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సరఫరా చేసే వ్యవస్థలు, కార్యాలయాల ప్రాంగణాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, ఫర్నీచర్‌తోసహా అన్నింటినీ బోర్డు తన అధీనంలోకి తీసుకుంటుందని ముఖర్జీ తెలిపారు. రోజు వారీ నిర్వహణ బాధ్యతలను బోర్డే చూస్తుందని, వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతోసహా అందరూ బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుందన్నారు.

➡️