వారణాసిలో మండపేట వాసుల ఆత్మహత్య

Dec 9,2023 10:15 #mandapeta, #residents, #Suicide, #Varanasi
  • అప్పులు తీర్చలేకనే బలవన్మరణం : పోలీసులు

ప్రజాశక్తి – మండపేట (డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర కోనసీమ జిల్లా) : అప్పుల బాధ తాళలేక డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన ఓ కుటుంబం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలోని ఓ కాటేజీలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వారణాసిలోని దశాశ్వమేథ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దేవనాథ్‌పూర్‌ ప్రాంతంలోని ధర్మశాలలో కాటేజ్‌లోని ఓ గదిలో గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు మండపేటకు చెందిన గుండవరపు కొండబాబు(50), లావణ్య(45) దంపతులతో పాటు వారి కుమారులు రాజేష్‌(25), జయరాజ్‌(23)లుగా అక్కడి పోలీసులు గుర్తించారు.

గురువారం సాయంత్రం వరకు కాటేజీ నుంచి కొండబాబు కుటుంబ సభ్యులు ఎవరూ బయటకు రాలేదు. ఐదు గంటల ప్రాంతంలో రూమ్‌ను క్లీన్‌ చేసేందుకు స్వీపర్‌ వచ్చి తలుపు తట్టినా తెరవలేదు. దీంతో కిటికీలోంచి స్వీపర్‌ లోపలికి చూశాడు. నలుగురి మృతదేహాలు వేలాడుతూ ఉండటంతో కాటేజీ యజమానులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. బస చేసిన గదిలోని పలు వస్తువులను పోలీసులు గుర్తించారు. పెట్రోల్‌ నింపిన మూడు బాటిల్స్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు. గదిలో కొంత విషపూరిత పదార్థం, కొన్ని మందులను, సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనే కుటుంబమంతా కాశీకి వచ్చారని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు స్పష్టం చేశారు. అప్పుల వివరాలను సూసైడ్‌ నోట్లో రాశారని పేర్కొన్నారు.

సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్న వ్యక్తులను విచారించేందుకు ఎపి పోలీసులను సంప్రందించినట్లు తెలిపారు. ఈ కుటుంబం రెండు నెలలుగా వివిధ ఆలయాలను సందర్శించినట్లు గుర్తించారు. కొండబాబు స్థానిక పెద్ద కాల్వ సమీపంలో మెకానిక్‌గా జీవనం సాగిస్తున్నారు. కుటుంబం మాత్రం గాంధీనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. డిసెంబర్‌ మూడున వీరంతా వారణాసి వెళ్లారు. కుటుంబ పోషణ నిమిత్తం కొండబాబు దొరికిన చోటల్లా అప్పులు చేశారు. వాటిని తీర్చకపోవడంతో వడ్డీలు పెరిగిపోయాయి. ఈ సమయంలో అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అందువల్లే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

➡️