తుపాను ముంచుకొచ్చె .. చేతికొచ్చే వరిపంట నేలకొరిగె..!

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ముంచుకొచ్చిన తుపాను కారణంగా … చేతికొచ్చే వరి పంట నేలకొరిగిన వైనం సోమవారం తెనాలి రూరల్‌ గ్రామాల్లో జరిగింది. మిచౌంగ్‌ తుపాను వేళ … రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వార్త అన్నదాతల గుండెల్లో గుబులు పుట్టించింది. ఈ తుఫాను ప్రభావంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వీచిన బలమైన ఈదురుగాలులు, కురిసిన వర్షానికి తెనాలి రూరల్‌ గ్రామాలైన నేలపాడు, తేలప్రోలు, ఐతానగర్‌ ప్రాంతాలలో వరి పంట నేలకొరిగింది. ఎంతో కొంతైనా చేతికి దక్కించుకుందామని రైతన్నలు ప్రయాసపడ్డారు. వరి కోత యంత్రాల ద్వారా కోతల కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వరి కోత యంత్రాలు కూడా పొలాల్లో ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు నిస్సహాయంగా నిలుచుండిపోయారు. వాన ధాటికి వరి పంటంతా నేలకొరగడంతో రైతులంతా కంటతడిపెట్టారు.

➡️