రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

Jun 27,2024 22:20 #3 death, #road acident, #vinukonda

– అదుపు తప్పి చెట్టుకు డీకొ ట్టిన కారు
ప్రజాశక్తి – వినుకొండ (పల్నాడు జిల్లా) :పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కారు అదుపు తప్పి చెట్టుకు ఢ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు..గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన సోమేసి బాలగంగాధర్‌శర్మ (78) తన చెల్లెలు పెళ్లి రోజు నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి మూడురోజుల క్రితం బళ్లారికి కారులో వెళ్లారు. బుధవారం రాత్రి గుంటూరుకు తిరుగుపయనమయ్యారు. గురువారం తెల్లవారుజామున పల్నాడు జిల్లా వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం వద్ద కారు అదుపు తప్పి హైవే పక్కనున్న చెట్టును ఢ కొట్టింది. బాలగంగాధర్‌ శర్మతో పాటు ఆయన భార్య యశోద (69), డ్రైవర్‌ నిర్మలరావు (48) అక్కడికక్కడే మృతి చెందారు. బాలగంగాధర్‌శర్మ కుమారుడు నాగశర్మ, కోడలు నాగసంధ్య, మనవరాలు అనుపమ, మనవడు కార్తీక్‌ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు వినుకొండ ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్సానంతరం గుంటూరుకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్రమత్త కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుల స్వస్థలం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాంభట్లవారిపాలెం కాగా గుంటూరులో స్థిరపడ్డారు.

➡️