ప్రతి ఒక్కరూ ఓటు వేయండి

Mar 21,2024 08:11 #AP CEO, #voters

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌ జవహర్‌రెడ్డి కోరారు. రాష్ట్ర సచివాలయంలో ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనాతో కలిసి రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు తెలిపారు. ఎన్నికల బందోబస్తు కోసం కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్నాటక పోలీసుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,165 పోలింగ్‌ కేంద్రాలుండగా, అందులో కనీసం 50శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. వెబ్‌ కాస్టింగ్‌ ఉన్న పోలింగ్‌ కేంద్రాలను నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానమై ఉంటాయని చెప్పారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.78కోట్ల నగదు, రూ.41కోట్ల విలువైనవస్తువులు, రూ.30కోట్ల విలువైన వివిధ డ్రగ్స్‌ వంటి వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన గత నాలుగు రోజుల్లోనూ వివిధ మోడల్‌కోడ్‌ తనిఖీ బృందాల ద్వారా రూ.3.39కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర సరిహద్దులు, ఇతర ప్రాంతాల్లో 60 ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్టులుతో సహా మొత్తం 121 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో 85 ఏళ్లు నిండిన వృద్ధులు, వివిధ అంగవైకల్యం కలిగిన ఓటర్లు ఇంటి నుంచే వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 46,165 పోలింగ్‌ కేందాలు : ముఖేష్‌కుమార్‌ మీనా
రాష్ట్రంలో 46,165 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ఎన్నికల సన్నద్దతపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరిం చారు. సెక్యూరిటీ సిబ్బందికి 12,683 వాహనాలు, పోలింగ్‌ సిబ్బందికి 13,322 వాహనాలు అవసరం ఉంటుందని తెలి పారు. ఎన్నికల నిర్వహణకు 175 మంది అసెంబ్లీ, 25 మంది పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ,829మంది అసెంబ్లీ, 209 మంది పార్లమెంట్‌ ఎఆర్‌ఓలు, 5వేల67మంది సెక్టోరల్‌ పోలీస్‌ అధికారులు, 18,961మంది మైక్రో అబ్జర్వర్లు, 55,269 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 2,48,814మంది పోలింగ్‌ అధికారులు, 46,165మంది బూత్‌స్దాయి అధికారులు, 416 మంది జిల్లా స్ధాయినోడల్‌ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

కేంద్ర, రాష్ట్ర బలగాలు: డిజిపి కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి
ఎన్నికల నిర్వహణ బందోబస్తుకు 1.50లక్షల మంది రాష్ట్ర పోలీసులతో పాటు 522 కంపెనీల స్టేట్‌ ఆర్మ్‌్‌డ్‌ రిజర్వు పోలీసు, 465 కంపెనీల సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసులతో పాటు కేరళ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి హోమ్‌గార్డులను నియమిస్తున్నట్లు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో హోమ్‌, పంచాయతీరాజ్‌, విద్యాశాఖల ముఖ్య కార్యదర్శులు హరీష్‌కుమార్‌గుప్తా, శశిభూషణ్‌ కుమార్‌, ప్రవీణ్‌ ప్రకాష్‌, హోమ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్‌, స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో డైరెక్టర్‌ రవి ప్రకాష్‌, పాల్గొన్నారు.

➡️