రైతులను ప్రోత్సహిస్తున్నాం : మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి

ప్రజాశక్తి-తాడికొండ (గుంటూరు జిల్లా) : తక్కువ పెట్టుబడితో సాగు చేసి ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి తెలిపారు. అగ్రిటెక్‌-2023 ప్రదర్శన, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై సదస్సు ఆదివారం గుంటూరు జిల్లా లాంలోని ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సదస్సులో మంత్రి కాకాని మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రభుత్వంతోపాటు, వ్యవసాయ వర్సిటీలు, టెక్నాలజీని అందిస్తున్న పరిశ్రమలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తల పరిశోధన వలన గతంలో 31 స్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం ర్యాంకింగ్‌ ప్రస్తుతం 13వ స్థానంలో ఉందని, త్వరలోనే కేటాయించే ర్యాంకింగ్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం దేశంలోనే మొదటి పది స్థానాల్లో చోటు సంపాదించుకుంటుందని తెలిపారు. డ్రోన్‌ టెక్నాలజీతో అన్నిరకాల పరిశోధనలు ఉద్యమంలా సాగుతున్నాయన్నారు. రైతుల సమస్యలకు గ్రామస్థాయిలోనే వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రతి గ్రామంలో రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సదస్సులో వ్యవసాయ వర్సిటీ ఉప కులపతి డాక్టర్‌ శారదా జయలక్ష్మీదేవి తదితులు పాల్గొన్నారు.

➡️