ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయిస్తానని మోడీతో చెప్పిస్తారా?

May 8,2024 08:52 #speech, #vadde

– చంద్రబాబును ప్రశ్నించిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు
– కార్పొరేట్లకు భూములు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన చట్టం
– దేశంలో తొలిసారి ఎపి అసెంబ్లీలో జగన్‌ ఆమోదింపజేశారు
– ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ ప్రమాదకరమైందని, దీన్ని రద్దు చేస్తానని చెబుతున్న చంద్రబాబు నాయుడు.. మోడీ విజయవాడ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ప్రధానితో ఆ మేరకు ప్రకటన చేయించగలరా? అని రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్‌ చేశారు. మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు, రిటైర్డు ఐఎఎస్‌ అధికారి బి శ్రీనివాసరావు, ప్రముఖ ఇంజినీరు కె విజయరావు తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. నీతి ఆయోగ్‌ సిఫార్సులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం చేసిందని తెలిపారు. దానికి ఛైర్మన్‌గా ఉన్న నరేంద్ర మోడీ విజయవాడ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయనతో ఈ సిఫార్సులను వెనక్కు తీసుకుని చట్టాన్ని రద్దు చేయిస్తామనే ప్రకటనను చంద్రబాబు చేయించాలని డిమాండ్‌ చేశారు. శాసనసభలో ఈ బిల్లును టిడిపి స్వాగతించిందని గుర్తు చేశారు. కార్పొరేట్లకు భూములను కట్టబెట్టేందుకు న్యాయపరమైన చిక్కులు రాకూడదనే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని తీసుకొచ్చారని వడ్డే తెలిపారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును అమలు చేయాలని సూచించిందే బిజెపి ప్రభుత్వమని, ఇప్పుడు వ్యతిరేకిస్తామని చెబుతున్న టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో చట్టానికి మద్దతు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. లోపల మద్దతు ఇస్తూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఈ చట్టాన్ని రద్దు చేయాలని, కేంద్రాన్ని ప్రశ్నించాలని చంద్రబాబును కోరారు. టిడిపి హయాంలో తీసుకొచ్చిన భూసేకరణ సవరణ చట్టాన్ని ఉపయోగించుకుని వైసిపి ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరుతో అక్రమాలకు పాల్పడిందని, ఈ అవకాశం ఇచ్చింది టిడిపి అనే అంశాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్ర విభజన చట్టం సందర్భంగా రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నరేంద్ర మోడీ నెరవేర్చలేదని చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధిపై చిత్తశుద్ధి వుంటే ఆ హామీలపై ప్రకటన చేయించాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదా, విభజన చట్టాల హామీని నిలబెట్టగలుగుతారా? అని ప్రశ్నించారు. 14వ ఫైనాన్స్‌ కమిషన్‌ ప్రత్యేక హోదా ఇవ్వొద్దని సిఫార్సు చేసిందని బిజెపి చెబుతోందని, వాస్తవానికి ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి బిజెపి వ్యతిరేకమని తెలిపారు. ఏడాదిపాటు జరిగిన రైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపిన టిడిపి ఎన్నికల్లో బిజెపికి మద్దతు ప్రకటించడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు. ఢిల్లీలో చారిత్రాత్మకమైన రైతాంగ పోరాటం సందర్భంగా రైతులకు మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని తెలిపారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన నరేంద్ర మోడీ పర్యటనను రాష్ట్ర ప్రజలు నిరసించాలని కోరారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా బిజెపికి మద్దతిచ్చే పార్టీలను ఓడించాలని, ఇండియా వేదిక భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ మేరకు రైతు సంఘాల సమన్వయ సమితి తీర్మానించింది. విలేకరుల సమావేశంలో రైతు నాయకులు సింహాద్రి ఝూన్సీ, కొలనుకొండ శివాజి, చుండూరు రంగారావు, ఎలమందరావు, తోట ఆంజనేయులు, వీరబాబు, ఎపి కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు, మరీదు ప్రసాదుబాబు పాల్గన్నారు.

➡️