మున్సిపల్‌ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన

– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

– 15వ రోజుకు చేరిన ఆందోళనలు

ప్రజాశక్తి-యంత్రాంగం:ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారంటూ కార్మికులు పంగనామాలు పెట్టుకొని సమ్మెలో పాల్గన్నారు. చెవిలో పువ్వులు పెట్టుకొని, భిక్షాటన, అర్ధనగ ప్రదర్శనలు చేస్తూ నిరసనలు కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 15వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని మున్సిపల్‌ కార్మికులు స్పష్టం చేశారు.శ్రీకాకుళం, ఇచ్ఛాపురంలో పంగనామాలు పెట్టుకొని సమ్మెలో పాల్గన్నారు. ఆమదాలవలసలో గడ్డిని తింటూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఐలూ రాష్ట్ర కమిటీ సభ్యులు బడ్డేపల్లి మోహనరావు సంఘీభావం తెలిపారు. విజయనగరం జిల్లాలో పంగనామాలు, చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. విశాఖ 5, 7 వార్డుల పరిధిలోని కారుషెడ్‌, వాంబేకాలనీ, ఉడా కాలనీలో చెత్త తరలింపు వాహనాలను, పోటీ కార్మికులను సమ్మె చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. అనకాపల్లిలో చెత్తను తరలించేందుకు వచ్చిన ప్రయివేటు ట్రాక్టర్లను అడ్డుకున్నారు. పలుచోట్ల కార్మికులు రోడ్లపై భిక్షాటన చేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లా మైలవరం, జగ్గయ్యపేటల్లో నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని, విజయవాడ ధర్నాచౌక్‌లో మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. నెల్లూరు గాంధీబమ్మ సెంటర్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వేప ఆకులు కట్టుకుని నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మానవహారం, నరసాపురంలో అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. కర్నూలులో సాష్టాంగ నమస్కారం, నంద్యాల, ఏలూరు జిల్లాల్లో పంగనామాలు పెట్టుకొని నిరసన కొనసాగించారు. కడపలో నడుముకు ఆకులు కట్టుకుని అర్ధనగ ప్రదర్శన నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మోకాళ్లపైన నిలబడి, కాకినాడ జిల్లా పెద్దాపురంలో వంటా వార్పు, సామర్లకోటలో అర్ధనగంగా మోకాళ్లపై నిలబడి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కోనసీమ, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, కృష్ణా, గుంటూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి.

➡️