వైసిపిపై దాడులను అడ్డుకోండి – గవర్నర్‌కు వైసిపి వినతి

Jun 29,2024 22:05 #Governor, #YSP plea

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తక్షణమే జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ను వైసిపి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి, అయోధ్యరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. వైసిపి నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని కోరారు. ఈ మేరకు శనివారం వైసిపి ప్రతినిధుల బృందం శుక్రవారం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం అయోధ్యరామిరెడ్డి, సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టిడిపి కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని, వైసిపి నాయకులను, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని హింస, బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. దీనిపై గవర్నర్‌కు వివరించినట్లు తెలిపారు. ఈ దాడులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించాలని డిమాండ్‌ చేశారు. కొన్ని జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తులను కూడా టిడిపి కూటమి కార్యకర్తలు ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. మాజీ సిఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను కూడా తగులబెట్టే పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప కేసులు నమోదు చేయడం లేదన్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం కేటాయించిన భూముల్లోనే, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పార్టీ భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అయినా అక్రమ నిర్మాణాలంటూ పూర్తయ్యే దశలోని తమ పార్టీ భవనాలను కూల్చివేస్తుండటంపై గవర్నర్‌కు వివరించామని తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నారాయణమూర్తి ఉన్నారు.

➡️