ప్రజాశక్తి-రామచంద్రపురం : అంగన్వాడి వర్కర్లు న్యాయమైన కోర్కెలు తీర్చాలంటూ చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం ఏడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో గల కపిలేశ్వరపురం, మండపేట, రామచంద్రపురం పట్టణం కే గంగవరం మండలాల నుండి పెద్ద ఎత్తున అంగన్వాడి వర్కర్లు ఆర్డిఓ కార్యాలయం చుట్టుముట్టారు. ముందు జాగ్రత్త చర్యలుగా పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను గేటు బయట అడ్డుకున్నారు. దేనితో అంగన్వాడి వర్కర్లంతా గేటు బయట బైఠాయించి నినాదాలు చేశారు. జీతాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ముందు పడుకుని నిరసన వ్యక్తం చేశారు. హక్కుల కోసం పోరాడుతామని, హక్కులను సాధిస్తామని నినాదాలు చేశారు. కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్ల నాయకులు డి, ఆదిలక్ష్మి, ఎం దుర్గ, సిఐటియు నాయకులు నూకల బలరాం తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 మంది అంగన్వాడి వర్కర్లు ఆర్డీవో కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.