ఐదేళ్లయినా లబ్ధిదారుల చెంతకు చేరని టిడ్కో ఇళ్లు

Apr 28,2024 21:16

ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్‌ : పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో పేదలకు కేటాయించిన టిడ్కో ఇళ్లు వైసిపి ఐదేళ్లపాలనలో వారి చెంత చేరలేదు. స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు పేదల ఇళ్ల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించారని బాధితులు వాపోతున్నారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో సొంత ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టి ఇవ్వాలనే లక్ష్యంతో టిడ్కో ఇళ్ల నిర్మాయణం చేపట్టారు. బ్యాంక్‌ రుణాల ద్వారా టిట్కో ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు 300 చదరపు అడుగులకు రూ.5వేల రూపాయలు, 365 చదరపు అడుగులకు రూ.25వేలు, 430 చదరపు అడుగులకు 50 వేల రూపాయలు మునిసిపల్‌ కార్యాలయం పేరున ఉన్న బ్యాంక్‌ ఖాతాకు సంబంధిత లబ్ధిదారులు బ్యాంకులో చెల్లించారు. అయితే లబ్ధిదారులకు నిర్మించాల్సిన ఇళ్లకు కావలసిన భూసేకరణను టిడిపి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చేయలేదు. అరకొరగా సేకరించిన స్థలంలో నిర్మించిన ఇళ్లు 25శాతం మాత్రమే పూర్తయ్యాయి.2019లో అధికారం చేపట్టిన వైసిపి ప్రభుత్వం సంబంధిత కాంట్రాక్టర్‌ నుండి ఆ పనులను కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించింది.అంతే కాకుండా రూ.56కోట్లతో పట్టణంలోని ఇళ్లు లేని 786 మంది లబ్ధిదారులకు 300 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఒక్క రూపాయికే టిట్కో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు అడ్డాపుశీల గ్రామం వద్ద 16 బ్లాకులలో నిర్మాణాలు చేపట్టారు. 5ఏళ్లు కావస్తున్నా నిర్మాణాలను పూర్తి చేశారు. భవన నిర్మాణాలు పూర్తయినా ఇళ్ల లోపల పనులు, మౌలిక సదుపాయాల కల్పన పనులు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి గృహ సముదాయాలకు వెళ్లేందుకు సిసి రోడ్లు, వాడుక నీరు వెళ్లేందుకు కాలువలు, విద్యుత్తు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాల పనులు పూర్తికాలేదు . గత ఏడాది ఉగాది నాటికి లబ్ధిదారులందరికీ అప్పగిస్తామని చెప్పి ఇళ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను మున్సిపల్‌ అధికారులు కూడా పూర్తి చేశారు కానీ ఈ ఏడాది ఉగాది నాటికి కూడా లబ్ధిదారులకు అందజేయలేదు.. ఇంతవరకు ఎనిమిది బ్లాకులకు పెయింటింగ్‌ పనులు పూర్తి చేశారు, మిగిలిన ఏడు బ్లాకులకు పెయింటింగ్‌ పనులు జరగలేదు. ఇంతలో ఎన్నికల కోడ్‌ రావడంతో ఈ పనులు నిలిచిపోయాయి. సొంతగూడులో తలదాచుకుందామని ఆశించినపేదలకు ఐదేళ్లుగా ఎదురు చూపులే మిగిలాయి. ఇంకా ఎన్నాళ్లుపడుతుందోనని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఐదేళ్ల క్రితం అప్పులు చేసి కట్టాంఇళ్ల కోసం రూ. 2కోట్ల 34లక్షల ను ప్రభుత్వానికి కట్టిన 624 మంది లబ్ధిదా రులు తమ డబ్బులు ఎప్పుడు అందుతాయని ఎదురుచూస్తూ, తమ డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ పలుమార్లు మున్సిపల్‌ కార్యాలయం చుట్టూ తిరుగు తున్నారు. కానీ కట్టిన డబ్బులు తిరిగి చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ కె. శ్రీనివాస్‌ను వివరణ కోరగా , లబ్ధిదారులు చెల్లించిన నగదును టిట్కో పిడి అకౌంట్‌కు ట్రాన్స్‌ ఫర్‌ చేశామని తెలిపారు. లబ్ధిదారులు చెల్లించే నగదును తిరిగి చెల్లించాలని లెటర్‌ కూడా పెట్టామని నగదు వచ్చిన వెంటనే లబ్ధిదారులకు చెల్లిస్తామని తెలిపారు.కోడ్‌ నేపథ్యంలో పంపిణీ జరగలేదుఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పంపిణీ జరగలేదు. త్వరలోనే గృహ సముదాయాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తాం. జ్యోతి, టిడ్కో ఇఇ పార్వతీపురం

➡️