ఓటు వేయడం పౌరుని బాధ్యత :వెంకట త్రివినాగ్‌

Apr 18,2024 11:35 #vijayanagaram

విజయనగరం కోట : ఓటు వేయడం ప్రతీపౌరుడి బాధ్యతని అసిస్టెంట్‌ కలెక్టర్‌ సహాదిత్‌ వెంకట త్రివినాగ్‌ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటే వజ్రాయుధమని ఆయన పేర్కొన్నారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా స్థానిక బాలాజీ క్లాత్‌ మార్కెట్‌ వద్ద బట్టల షాపుల యజమానులకు, వర్కర్లకు గురువారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తామంతా తప్పకుండా ఓటేస్తామని, వారిచేత ప్రతిజ్ఞ చేయించారు. మానవ హారాన్ని నిర్వహించారు. ఓటువిలువను తెలుపుతూ నినాదాలు చేయించారు.
అసిస్టెంట్‌ కలెక్టర్‌ త్రివినాగ్‌ మాట్లాడుతూ, మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతీఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ ఓటు విలువైనదేనని ఆయన స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 7 గంటలు నుంచి సాయంత్రం 6 గంటలు మధ్య ఎప్పుడైనా ఓటుహక్కును వినియోగించుకోవచ్చునని చెప్పారు. ఓటు విషయంలో ఏమైనా సమస్య వస్తే, తమ బిఎల్‌ఓను, ఎన్నికల రోజు ఓటు వేయడంలో ఇబ్బందులు ఎదురైతే ప్రిసైడింగ్‌ అధికారిని సంప్రదించాలని సూచించారు. ప్రజలంతా స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లనూ చేసిందన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు లంగకుండా తమ ఓటు హక్కును స్వేచ్చగా, నిర్భయంగా వినియోగించుకొని, సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో అసిస్టెంట్‌ మున్సిపల్‌ కమిషనర్‌ తిరుమల రావు, స్వీప్‌ నోడల్‌ అధికారి, హౌసింగ్‌ పిడి శ్రీనివాసరావు, బాలాజీ మార్కెట్‌ క్లాత్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వెంకటరావు, స్వీప్‌ రీసోర్స్‌ పర్సన్‌ పద్మనాభం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️