ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు కన్నుమూత

చెన్నై : ప్రముఖ తమిళ, తెలుగు నటుడు, కమెడియన్‌ గరిమెళ్ళ విశ్వేశ్వర రావు (62) మంగళవారం కన్నుమూశారు. గత రెండేళ్లుగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల బాగా క్షీణించింది. చెన్నైలోని సిరుచ్చేరిలోని తన నివాసంలో విశ్వేశ్వరరావు తుదిశ్వాస విడిచారు. దీంతో తమిళ, తెలుగు ఇండిస్టీలో విషాదం నెలకొంది. ఆయన భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం చెన్నైలోని సిరుశేరిలో ఉన్న ఆయన నివాసంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బాలనటుడిగా ప్రస్థానం ప్రారంభించిన గరిమెళ్ళ విశ్వేశ్వరరావు తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 150కి పైగా సినిమాలలో సహాయ పాత్రలు, హాస్య పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. కాకినాడకు చెందిన విశ్వేశ్వరరావు చిన్నతనంలో తండ్రి హరికథలు చెబుతుండగా ఆసక్తితో నేర్చుకున్నారు. పద్మనాభం సినిమా పొట్టి ప్లీడరులో బాల నటుడిగా వేషం వేశారు. బాలభారతం సినిమాలో శ్రీదేవి సరసన నటించారు. సినిమాలు చేస్తూనే ఎం.ఎస్సీ చదివి పూర్తి చేశారు. సినిమాలలో అవకాశాలు పెద్దగా లేకపోవడంతో ఒక ఫార్మాస్యూటికల్‌ సంస్థలో రెప్రెజెంటేటివ్‌ గా చేరి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాలు తిరిగేవారు.

పొట్టి ప్లీడరు, బాలభారతము, ముఠా మేస్త్రి, బిగ్‌ బాస్‌, మెకానిక్‌ అల్లుడు, ప్రెసిడెంటు గారి పెళ్ళాం, ఆయనకి ఇద్దరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, కథానాయకుడు, శివాజీ, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి చిత్రాలలో నటించారు. నిండు హృదయాలు, భక్త పోతన, బాలమిత్రుల కథ, ఓ సీత కథ, మా నాన్న నిర్ధోషి, పట్టిందల్లా బంగారం, అందాల రాముడు, ఇంటిగౌరవం వంటి చిత్రాలు బాల నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రముఖ హాస్యనటులు రాజబాబు చిన్ననాటి పాత్రల్లో విశ్వేశ్వరరావు ఎక్కువగా నటించేవారు. బాలనటుడిగా 150కిపైగా చిత్రాల్లో నటించారు. అనంతరం కాలంలో ఆయన సహాయ పాత్రల్లో మెప్పించారు. హాస్య నటుడిగా తనదైన ప్రతిభతో మెప్పించారు. సినిమాలతో పాటు 150కి పైగా సీరియల్స్‌లోనూ నటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్టాలకు ముఖ్యమంత్రలుగా పని చేసిన ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌, జయలలితలతో కలిసి ఆయన నటించడం విశేషం. దాదాపు అన్ని హస్య పాత్రల్లోనే నటించిన ఆయన చాలా తమిళ సినిమాలకు తెలుగులో డబ్బింగ్‌ కూడా చెప్పారు.

➡️