ఉపాధికి బాసటగా .. భాషా శిక్షణ

Mar 1,2024 10:57 #feature

జీవన నైపుణ్యాలకు తోడు భాషలపై పట్టుంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చు. ఇప్పుడు ఉద్యోగ పరీక్షలు రాయాలంటే ఆంగ్లంలో పట్టు చాలా అవసరం. అందుకే చాలామంది డిగ్రీలు పూర్తి చేసిన తర్వాత స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ఇంగ్లీషు భాషా నైపుణ్యం పెంపొందించటమే లక్ష్యంగా కృష్ణా విశ్వ విద్యాలయం ఇంగ్లీషు అధ్యాపకులు డాక్టర్‌ ఎం.కోటేశ్వరరావు కృషి చేస్తున్నారు. గత ఐదేళ్లుగా వందలాదిమంది విద్యార్థులకు తన సహకారం అందించారు.

             మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం ఇంగ్లీషు అధ్యాపకులు డాక్టర్‌ ఎం.కోటేశ్వరరావు ఎంఎ ఇంగ్లీషు, ఎంఫిల్‌, ఫిహెచ్‌డి చేశారు. ఎంఎస్‌సి సైకాలజీ, డిప్లమో ఇన్‌ కెరీర్‌ గైడెన్స్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ పూర్తిచేశారు. చిన్నప్పుడు ఆయనకు ఇంగ్లీష్‌ అంటే భయం. సరిగ్గా అర్థమయ్యేది కాదు. ఇంటర్‌లో బాగా ఇబ్బంది పడ్డారు. డిగ్రీలోనూ, ఆ తర్వాత ఇంగ్లీషుపై పట్టు సాధించారు. మన చుట్టూ ఉన్న సమాజంలో తనలాంటి వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవటం కోసం మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లోని అన్ని మురికివాడల్లో ఆయన పర్యటించారు. ప్రత్యేక ప్రశ్నావళి రూపొందించి ఇంటింటికీ వెళ్లి 2013 నుంచి 2017 వరకూ సమస్యలపై అధ్యయనం చేశారు. ఎక్కువగా ఆడపిల్లలు చదువుకు దూరంగా ఉండటం, బాల్యవివాహాలు, మహిళలపై వేధింపులు, చదువుకుంటున్న ఆడపిల్లల్లో ఎక్కువ మంది ఇంగ్లీషులో వెనుకబడి ఉండటాన్ని గమనించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కూడా ఇలాంటి సర్వే నిర్వహించారు. అక్కడ కూడా విద్యార్థినులు ఇంగ్లీషులో మాట్లాడటం, చదవటంలోనూ నెమ్మదిగా ఉండటాన్ని గమనించారు. దీనిని సరిదిద్దటానికి తనవంతుగా ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. చిన్నప్పుడు ఆయనకు కుటుంబపరంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావటంతో ఇంగ్లీషు నేర్చుకోలేకపోయారు. పేదరికంతో ఎవ్వరూ ఇంగ్లీషుకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులు ప్రారంభించారు. ఇంగ్లీషు టైపింగ్‌ కూడా నేర్చుకోవాలని ప్రోత్సహిస్తున్నారు.

2018లో మచిలీపట్నం మండలంలోని ఎస్‌ఎన్‌ గొల్లపాలెంలోనూ విద్యార్థినుల కోసం తొలుత ఉచిత స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులు ప్రారంభించారు. ఆయన శిష్యులు కూడా ఈ తరగతులకు సహకారం అందిస్తూ బోధిస్తున్నారు. ఆ తర్వాత 2019లో లేడీ యాంప్తిల్‌ హైస్కూల్‌, రుద్రవరం గురుకుల పాఠశాలలో రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. కోవిడ్‌ రావటంతో తరగతులు ఆగిపోయాయి. 2021లో రుస్తుంబాద హైస్కూల్‌, చిలకలపూడిలోని పాండురంగ హైస్కూలు, పద్మావతి మహిళా కళాశాలల్లో కూడా రెండు బ్యాచ్‌లుగా తరగతులు నిర్వహించారు. 2023-24లో కృష్ణా విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థినులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ 11 బ్యాచ్‌ల్లో సుమారు 1000 మందికి శిక్షణ ఇచ్చారు. తన వద్ద చదువుకుంటున్న విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చి వారి ద్వారా కూడా బోధన సాగిస్తున్నారు. వారికి తన సొంత ఖర్చులతోనూ, దాతల ద్వారా కొంత పారితోషికం కూడా ఇస్తున్నారు.

పూలే, అంబేద్కర్‌ స్ఫూర్తితో …

             ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలల్లో చదువుకునే గ్రామీణ ప్రాంత విద్యార్థినుల ఇంగ్లీషు నైపుణ్యాలను పెంపొందించటానికిగాను ఉచితంగా స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థినులకు మాత్రమే కోటేశ్వరరావు ఈ బోధన చేస్తారు. అంబేద్కర్‌, ఫూలే స్ఫూర్తితో ఉచిత విద్యాబోధన చేస్తున్నట్టు ఆయన చెప్పారు. తొలుత ఎంచుకున్న పాఠశాల, కళాశాలలో ఆంగ్ల విభాగానికి సంబంధించిన అంశాలపై విద్యార్థినులకు పరీక్ష పెడతారు. వచ్చిన మార్కులను బట్టి వారి శక్తి సామర్థ్యాలను భాషపై అంచనా వేస్తారు. వారి స్థాయిలకు తగినట్టుగా మూడు నెలల స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులకు సిలబస్‌ తయారు చేస్తారు. దానిని ప్రతిరోజు రివైజ్‌ చేస్తుంటారు. పాఠశాలలు, కళాశాలల జరిగే సమయంలోనే ఈ తరగతులు జరుగుతాయి. వసతి గృహాల్లో ఉదయం లేదా రాత్రి సమయాల్లో కొనసాగుతాయి. విద్యార్థులను జట్లుగా విభజిస్తారు. వారి స్థాయిలకు తగ్గట్టుగా ఆయా కృత్యాలకు ఎంపిక చేసి రైమ్స్‌, పదాలు, పాటలు, నృత్యాలు వంటివి ఇంగ్లీషు అంశాలను జోడించి నేర్పిస్తారు. ఇలా నేర్చుకున్న వారిలో ప్రతిరోజూ ఇద్దరికి తగ్గకుండా తిరిగి తరగతిలో చెప్పాల్సి వుంటుంది. ఇలా మరింత ప్రావీణ్యత చూపించిన వారికి మిగతా క్లాసుల్లో కూడా బోధించటానికి అవకాశం కల్పిస్తుంటారు. స్టూడెంట్‌ సెంటర్‌ మెథడ్‌తో ప్రతి విద్యార్థిని కృత్యంలో పాల్గొనటం ద్వారా భాషలో ప్రావీణ్యత సాధించేలా కృషి చేస్తున్నారు.

– కొల్లూరి జాకబ్‌, మచిలీపట్నం రూరల్‌, సెల్‌ : 8125432290

భయం పోగొట్టి …భరోసానిస్తూ…

               ఇంగ్లీషు అంటే భయం ఉన్న వారికి కూడా ఆటపాటలతో నేర్చుకోవటం పట్ల ఆసక్తి కలిగించి, వారిలో మనోవికాసానికి బాటలు వేస్తున్నాం. అథమస్థితి నుంచి అత్యున్నత స్థాయిలో నిలిచిన మహిళామణుల జీవితగాథలను ఇంగ్లీషులో స్టోరీలుగా చెబుతున్నాం. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. గతంలో మచిలీపట్నం, రుద్రవరం, విజయవాడ రూరల్‌, నున్న, మైలవరం తదితర ప్రాంతాల్లో సదస్సులు, సెమినార్లు నిర్వహించాం. ఆయా పాఠశాలలు, కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు మొదటగా శిక్షణ ఇచ్చి ఆ తర్వాత తరగతులు వారే కొనసాగించేలా కూడా ప్రోత్సహిస్తున్నాం.

– డాక్టర్‌ ఎం.కోటేశ్వరరావు, ఇంగ్లీష్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌, కృష్ణా విశ్వవిద్యాలయం, మచిలీపట్నం

బెటర్‌స్థాయికి చేరుకున్నా …

             మొదటి నుంచి ఇంగ్లీష్‌ సబ్జెక్టును బట్టీపట్టి చదవటం వల్ల పూర్తిగా అర్థంకాక ఇబ్బంది పడ్డాను. స్పోకెన్‌ ఇంగ్లీషు తరగతులకు హాజరయ్యాక స్పష్టంగా చదవటం, మాట్లాడుతున్నాను. మార్కులు కూడా ఈ సబ్జెక్టులో పెరిగాయి. యావరేజ్‌ స్థాయిలో ఉన్న నేను ఇప్పుడు బెటర్‌స్థాయికి వచ్చాను. – సిహెచ్‌.సింధూర

ఆట, పాటలతో బోధన

ఇంగ్లీషులో పదాలు, వాక్యాలు ఎలా పలకాలో ఆట పాటల ద్వారా నేర్పిస్తున్నారు. స్నేహపూర్వకమైన వాతావరణంలో బోధన ఉండటంతో ఇంకా నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. రైమ్స్‌ను డ్యాన్స్‌ ద్వారా బోధిస్తుండటంతో ఏ మాత్రం ఒత్తిడి లేకుండా సరదాగా నేర్చుకుంటున్నాం. – జి.జ్యోత్స్న

➡️