ఒకే నియోజకవర్గం.. 2 జిల్లాలు

May 8,2024 00:26 #karnool

– పాణ్యంలో త్రిముఖ పోటీ
-జోరుగా సిపిఎం అభ్యర్థి ప్రచారం
ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి :ఒకే నియోజకవర్గం రెండు జిల్లాల్లోనూ భాగాలుగా విడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో పాణ్యం నియోజకవర్గం సగం కర్నూలు జిల్లా, సగం నంద్యాల జిల్లా పరిధిలోకి వెళ్లింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కర్నూలు జిల్లాలోకి కల్లూరు, ఓర్వకల్లు మండలాలు, నంద్యాల జిల్లాలోకి పాణ్యం, గడివేముల మండలాలు చేరాయి. పాణ్యం నియోజకవర్గంలో ఈ సారి త్రిముఖ పోటీ నెలకొంది. వైసిపి, టిడిపితోపాటు సిపిఎం అభ్యర్థి జోరుగా ప్రచారం సాగిస్తున్నారు..
ఈసారి ఎన్నికల్లో పాణ్యం నియోజకవర్గం నుంచి 14 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టిడిపి, వైసిపి, సిపిఎం మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వైసిపి తరపున కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, టిడిపి తరపున గౌరు చరితా రెడ్డి, సిపిఎం తరపున డి గౌస్‌ దేశారు పోటీలో ఉన్నారు. సిపిఎం అభ్యర్థి డి గౌస్‌ దేశారు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటా ప్రజల సమస్యలు వింటూ ముందుకు సాగుతున్నారు. అడుగడుగునా ప్రజలు ఆయనకు నీరాజనం పడుతున్నారు. తనను గెలిపిస్తే పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, ప్రధానంగా ప్రజలు ఎదుర్కొనే నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని, కర్నూలు నగరానికి రెండో సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు నిర్మాణం కోసం కృషి చేస్తామని చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పోటీలో ఉన్న వారిలో వైసిపి అభ్యర్థి కాటసాని రాంభూపాల్‌ రెడ్డి పాణ్యం నుంచి ఆరుసార్లు, టిడిపి అభ్యర్థి గౌరు చరితా రెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి అక్కడి నుంచే..
1993లో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కోసం కాటసాని రాంభూపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో కోట్ల గెలుపొందారు. కోట్ల రెండు సార్లు ఎమ్మిగనూరులో, ఒకసారి డోన్‌లో గెలిచారు. ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పాణ్యం నియోజకవర్గంలో అయ్యపురెడ్డి
రెండు సార్లు గెలిచారు. ఆయన మరోసారి నందికొట్కూరు, ఇంకోసారి మిడుతూరులో నెగ్గారు. పాణ్యంలో ఒకసారి కాంగ్రెస్‌ తరపున అయ్యపురెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకసారి ఎంపిగా గెలిచారు. ప్రతిపక్ష నేతగా, మంత్రిగా కూడా పని చేశారు. 1983లో పాణ్యంలో టిడిపి తరపున గెలిచిన చల్లా రామకృష్ణారెడ్డి, 1999, 2004లో కాంగ్రెస్‌
తరపున కోయిలకుంట్లలో గెలుపొందారు.
వైసిపి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, టిడిపి అభ్యర్థి అభివృద్ధి కోసం పెద్దగా పట్టిచుకోకపోవడం వంటి కారణాలతో ఇండియా వేదిక అభ్యర్థి తరపున గతంలో చేసిన పోరాటాలే పాణ్యం నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి గౌస్‌ దేశాయిని గెలిపిస్తారని స్థానికులు చెబుతున్నారు.

సిపిఎం పోరాటాలు
పాణ్యం నియోజకవర్గంలో సిపిఎం అనేక పోరాటాలు నిర్వహించింది. పాణ్యం మండలం పిన్నాపురంలో పవన, సోలార్‌ పేరుతో గ్రీన్‌కో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. పేదలు దగ్గర భూములు తీసుకుని పట్టాలు లేవనే పేరుతో వారికి పరిహారం ఇవ్వడం లేదు. కొండజూటూరు వద్ద నానో కెమికల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చూస్తే గ్రామస్తులు అడ్డుకోవడం, పోరాటాల వల్ల వెనక్కి తగ్గారు. సోలార్‌ బాధితులకు పరిహారం ఇవ్వాలని సిపిఎం అగ్రనాయకులు ప్రకాష్‌కరత్‌, బివి రాఘవులు, పి మధు, ఎంఎ గఫూర్‌ పోరాటం చేసేందుకు వస్తే వారిపై 42 కేసులు నమోదు చేశారు. చెన్నై, సూరత్‌ భూ నిర్వాసితుల కోసం తీవ్ర పోరాటం చేశారు. పాణ్యం నుంచి కల్లూరు మండలం పెద్దపాడు వరకూ 150 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. కల్లూరు మండలంలో భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన సమయంలో తీవ్ర ఆందోళనలు చేపట్టారు. కల్లూరు ఐటిసి వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మించాలని ఆందోళనలు చేశారు. కల్లూరు అర్బన్‌ వీకర్‌ సెక్షన్‌ కాలనీలో 40 వేల జనాభా ఉండగా శ్మశానం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని, శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని పోరాటం నిర్వహించారు.

➡️