పల్లెకు పయనం

May 8,2024 00:36 #vote

– గెలుపోటములను నిర్ణయించడంలో
వలస ఓటర్ల కీలకపాత్ర
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించడంలో వలస ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. దీంతో సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు తమ సొంత నిధులతో గ్రామాల బాట పడుతున్నారు. స్థానిక సంస్థల తరహాలో ప్రతి ఓటునూ పోల్‌ చేయించుకునేందుకు రాజకీయ పార్టీలు కూడా తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ఈ దఫా ఎన్నికల్లో ప్రతి ఓటూ తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయంలో పోటీలో ఉండే అభ్యర్థులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో గెలుపోటములు శాసించిన నియోజకవర్గాలు అత్యధికంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇంటివద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే వృద్ధులు, వికలాంగులపై దృష్టి సారించిన పార్టీలు, తాజాగా ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తమ శక్తి యుక్తులన్నింటినీ ఉపయోగించుకుంటున్నాయి. ఆయా ప్రాంతాల్లో పోటీలో ఉండే అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొచ్చిన సంఘటనలు అనేకం కనిపిస్తున్నాయి.
ఫోన్ల ద్వారా సంప్రదింపులు
బతుకు తెరువు కోసం సుదూర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లను ఓటింగుకు వచ్చేందుకు వీలుగా వారి సన్నిహితులు, బంధువుల ద్వారా నాయకులు ఫోన్లు చేయిపించి సంప్రదింపులు మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి జిల్లాల నుంచి వలసలు అధికంగా ఉన్నాయి. వీరంతా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాల్లో చిన్నా చితకా పనులు చేసుకుంటూ బతుకులీడుస్తున్న వారు అధికంగా ఉన్నారు. యువత అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లో సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13న పోలింగు సందర్భంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు ఇప్పటికే కొంతమంది పల్లెలకు చేరుకున్నారు. మరికొందరు ఆర్‌టిసి బస్సుల్లో రిజర్వేషన్లు కష్టమవడంతో సొంతంగా డబ్బులు పెట్టి ప్రైవేటు వాహనాల్లో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే తెలంగాణ నుంచి రాష్ట్రానికి వచ్చే ఓటర్ల కోసం తెలంగాణ ఆర్‌టిసి, ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రధాన పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ఏదేమైనప్పటికీ వలస ఓటర్లు పోలింగుకు స్వగ్రామాలకు రావడం ఆర్థిక భారంగా మారిందనే అభిప్రాయం సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.

➡️