ధర్మాన.. గట్టెక్కేనా..?

May 11,2024 00:02 #srikakulam

– గ్రామీణ ప్రాంతాల్లో వైసిపి,టిడిపి పోటా పోటీ

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఈసారి విజయం అంత సులభం కాదనే చర్చ నడుస్తోంది. టిడిపి అభ్యర్థి గొండు శంకర్‌తో గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుండ లక్ష్మీదేవికి పార్టీ టికెట్‌ నిరాకరించడంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేగాయి. ఇండిపెండెంటుగా పోటీ చేయాలని కార్యకర్తలు ఆమెపై తీవ్ర ఒత్తిడి చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు ఏప్రిల్‌ 16న పలాసలో ఎన్నికల ప్రచార సభకు వచ్చిన సందర్భంలో గుండ దంపతులను బుజ్జగించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. తాము క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. టిడిపిలో నెలకొన్న ఈ పరిస్థితులు తమకు అనుకూలిస్తాయని ధర్మాన భావించారు. అందుకనుగుణంగానే గొండు శంకర్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న గార, శ్రీకాకుళం నగరానికి చెందిన కొందరు టిడిపి నాయకులు వైసిపిలో చేరారు. గుండ లక్ష్మీదేవి నివాస ప్రాంతమైన అరసవల్లి నుంచి పెద్దయెత్తున కేడర్‌ ధర్మాన పక్షాన చేరారు. ఇదే సమయంలో ధర్మానను వ్యతిరేకిస్తున్న వైసిపి ముఖ్య నాయకులు, కేడర్‌ టిడిపి కండువా కప్పుకున్నారు. మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ అంధవరపు నరసింహం కుటుంబం టిడిపి గూటికి చేరింది. 2004 నుంచి 2012 మధ్య కాలంలో ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్‌మనోహర్‌నాయుడు, అనుచరులు వ్యాపారులను హడలెత్తించారు. కళింగ వైశ్యులు, వర్తకుల్లో ఇప్పటికీ ఆ భయం వెంటాడుతోంది. శ్రీకాకుళం నగరంలో తీవ్ర వ్యతిరేకత ప్రబలడంతో మంత్రి ధర్మాన 2014 ఎన్నికల్లో 26 వేల ఓట్ల తేడాతో దారుణ పరాభవం చవిచూశారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర మంతటా వైసిపి ప్రభంజనం వీచినా ధర్మాన ప్రసాదరావు 5,777 ఓట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కారు. శ్రీకాకుళం నగరంలో మాత్రం టిడిపికి వెయ్యి ఓట్ల ఆధిక్యం లభించింది.
ధర్మాన పని తీరుపై అసంతృప్తి
శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలో శ్రీకాకుళం, గార మండలాలు ఉన్నాయి. వైసిపి లెక్కల ప్రకారం టిడిపికి పట్టున్న గార మండలంలో ఈసారి 50 శాతం ఓట్లు తమకు పడతాయని వారు అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళం రూరల్‌ మండలంలో తమకు ఫర్యాలేదని వైసిపి నాయకులు చెప్తున్నారు. శ్రీకాకుళం అర్బన్‌లోనే తమకు వ్యతిరేకంగా ఓటింగ్‌ జరుగుతుందనే గుబులు వైసిపి కేడర్‌లో ఉంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అభివృద్ధి జాడలే కనిపించడం లేదు. ప్రధానంగా ఈ ఐదేళ్ల కాలంలో గార మండలానికి సాగునీరందక పంటలు సక్రమంగా పండని పరిస్థితి నెలకొంది. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియాన్ని కూలగొట్టి కొత్తగా నిర్మాణం చేపడతామని చెప్పినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వరకు రోడ్డు విస్తరణ పనులను అర్ధాంతరంగా ఆపేసి ప్రయాణికులకు తీవ్ర కష్టాలను మిగిల్చారు. ప్రభుత్వపై ఉన్న వ్యతిరేకతతో పాటు ధర్మాన పని తీరుపైనా వ్యతిరేకత ఉండటంతో గెలుపు సమీకరణాలు క్లిష్టతరంగా మారాయన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది.
అసంతృప్తితో సక్రమంగా పనిచేయని కేడర్‌
మంత్రి ధర్మాన ప్రసాదరావు గెలుపు కోసం కేడర్‌ సీరియస్‌గా తీసుకోవడం లేదనే చర్చ నడుస్తోంది. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు తమతో డబ్బులు ఖర్చు చేయించి తమకు ఎటువంటి ప్రయోజనం చూపలేదనే ఆవేదన శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జుల్లో నెలకొంది. ధర్మాన ముఖ్య అనుచరుడు ఒకరు కార్పొరేషన్‌లోని అన్ని కాంట్రాక్టు పనులు, ఇతర వ్యవహారాలు చక్కపెడుతుండటంతో డివిజన్‌ ఇన్‌ఛార్జులు లోలోపల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం నగర పార్టీలో ముఖ్య నాయకుడొకరు ఆరు డివిజన్ల పరిధిలో అంగన్వాడీ, వలంటీర్ల పోస్టులను అమ్ముకున్నారన్న ఆరోపణలతో పార్టీకి అప్రతిష్ట వచ్చింది. శ్రీకాకుళం నగరంలో ముఖ్య నేతగా ఉన్న ఓ మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌కు ఎమ్మెల్సీ పదవి రాకుండా ధర్మాన చేశారన్న కోపం ఆమె వర్గం కేడర్‌లో నెలకొంది. వారంతా అన్యమనస్కంగానే పనిచేస్తున్నారు. పరిస్థితులు తారుమారు కావడంతో ధర్మాన శిబిరంలో ఆందోళన మొదలైంది. దీంతో ప్రలోభాలు, పోల్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రధానంగా దృష్టి సారించారు.

➡️