దేశం వీడిన దేవెగౌడ మనుమడు

బెంగళూరు : భారత మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్నికల సమయాన దేశం విడిచి పారిపోయారు. ఇప్పుడు కర్ణాటకలో ఈ అంశమే హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో దేవెగౌడ పలు మార్లు గెలిచిన, కంచుకోట అయిన హసన్‌ లోక్‌సభ స్థానం నుంచి రేవణ్ణ ఈసారి పోటీకి దిగారు. అయితే ఇటీవల ఆయనపై అసభ్యకర వీడియోలు ప్రచారంలోకొచ్చాయి. దీంతో ఈ వీడియోలపై కర్ణాటక సిఎం సిద్ధరామయ్య ప్రభుత్వం దర్యాప్తు కోసం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ని (సిట్‌) ఏర్పాటు చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేవణ్ణ ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయల్దేరి వెళ్లడం గమనార్హం. మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు ముందు ప్రజ్వల్‌కి చెందిన అసభ్యకర వీడియోలు హసన్‌ జిల్లాలో సోషల్‌ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. మహిళపై లైంగిక వేధింపుల కోణంపై కూడా సిట్‌ దర్యాప్తు చేస్తుందని సిఎం చెప్పారు. కాగా రేవణ్ణను అప్రదిష్టపాల్జేయడానికి నవీన్‌ గౌడతో కలిసి మరికొందరు వీడియో క్లిప్‌లను వ్యాప్తి చేశారని జెడిఎస్‌, బిజెపి ఎలక్షన్‌ ఏజెంట్‌ పూర్ణచంద్ర గౌడ ఆరోపించారు. వీడియోలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవణ్ణపై మార్ప్‌ చేసిన వీడియోలను సృష్టించి అతనికి ఓట ేయొద్దని ప్రచా రం చేస్తున్నట్లు పూర్ణచంద్ర గౌడ పేర్కొన్నాడు. మరోవైపు ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ ప్రభుత్వానికి లేఖ రాశారు. హసన్‌ నియోజకవర్గం దేవెగౌడ కుటుంబానికి కంచుకోట లాంటిది. రాజకీయంగా పుట్టస్వామి కుటుంబంపై వీరిదే ఆధిపత్యం. 1994, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి హుళెనరసిపుర శాసనసభ స్థానం నుంచి పోటీ చేసినప్పటికీ.. దేవెగౌడ పెద్ద కుమారుడు హెచ్‌.డి రేవణ్ణ చేతిలో పరాజయం పాలయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి కోడలు ఎస్‌.జి అనుపమకూ ఓటమి తప్పలేదు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పుట్టస్వామి మనవడు శ్రేయస్‌ పటేల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయగా.. 3,152 ఓట్ల తేడాతో రేవణ్ణ చేతిలో ఓడిపోయారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇరు కుటుంబాలకు చెందిన వారే మళ్లీ పోటీపడుతున్నారు.

➡️