పేట ఎంపిగా సిట్టింగ్గా ! కొత్త వారా !!

May 9,2024 00:24 #guntur

-మరోసారి గెలవడానికి శ్రీకృష్ణదేవరాయలు పట్టు

– బిసి కార్డుతో విజయం తనదేనంటున్న అనిల్‌
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :నర్సరావుపేట ఎంపి స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఎవరికి వారు తమదే విజయమనే ధీమాగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి నుంచి ఎంపిగా గెలుపొందిన లావు శ్రీకృష్ణదేవరాయులు ఈసారి టిడిపి నుంచి, నెల్లూరు ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌ వైసిపి నుంచి, అలెగ్జాండర్‌ సుధాకర్‌ ఇండియా వేదిక తరపున కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇతరులు పోటీలో ఉన్నా …ప్రధాన పోటీ వీరి మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. 1952 నుంచి 2019 వరకూ 15 సార్లు ఎన్నికలు జరగగా, తొమ్మిది సార్లు కాంగ్రెస్‌, నాలుగు సార్లు టిడిపి, ఒకసారి వైసిపి, ఒకసారి ఇండిపెండెంట్‌ గెలుపొందారు. స్థానికేతరులుగా నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కె.రోశయ్య, మోదుగుల వేణుగోపాలరెడ్డి, రాయపాటి సాంబశివరావు, శ్రీకృష్ణదేవురాయులు ఎంపిలుగా గెలుపొందారు. స్థానిక, స్థానికేతరులను ఆదరించిన ఘనత ఈ నియోజకవర్గ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
గత ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయులు 1,53,979 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ఈసారి మెజార్టీ తగ్గినా గెలుపు తనదేనని ఆయన ధీమాగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ప్రభావంతో గత ఐదేళ్లుగా ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగించిన శ్రీకృష్ణదేవరాయులు పట్ల కొన్ని తరగతుల ప్రజల్లో సానుకూలత ఉండటం టిడిపికి అనుకూలాంశం. అనిల్‌కుమార్‌ వైసిపి అభ్యర్థిగా ఖరారైన కొద్ది రోజులకే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసిపికి రాజీనామా చేసి శ్రీకృష్ణదేవరాయులు సహకారంతో టిడిపిలో చేరారు. అనిల్‌కుమార్‌ బిసి కార్డుకు జంగా ద్వారా ‘బ్రేకులు’ వేయాలని శ్రీకృష్ణదేవరాయులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం జంగా టిడిపి గెలుపునకు విస్తృతంగా తిరుగుతున్నారు. శ్రీకృష్ణదేవరాయులు ఐదేళ్లుగా పలు పథకాలను మంజూరు చేయించడం, సౌమ్యుడిగా, నిజాయితీ పరుడుగా పేరు ఉండటం వల్ల అన్ని తరగతుల్లో ఆదరణ ఉందని టిడిపి నాయకులు చెపుతున్నారు.
ఇక్కడ ఇప్పటివరకు ఏ పార్టీ ఒక్కసారీ బిసిలకు అవకాశం ఇవ్వని నేపథ్యంలో సిఎం జగన్‌ తొలిసారి తనకు అవకాశం ఇచ్చినందున విజయం చేకూర్చాలని వైసిపి అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తన ప్రచారంలో చెపుతున్నారు. అంతేగాక తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయంటున్నారు అనిల్‌. ప్రభుత్వ వ్యతిరేకత కొంతున్నా బిసిలు అధిక సంఖ్యలో ఉండటం వల్ల అనిల్‌కుమార్‌తో పాటు తమ విజయావకాశాలూ మెరుగుపడతాయని వైసిపి అసెంబ్లీ అభ్యర్థులు కూడా ఆశలు పెట్టుకున్నారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల టిడిపికి, పెదకూరపాడు, మాచర్ల, నరసరావుపేట వైసిపికి అనుకూలంగా ఉన్నాయనే చర్చ గత కొద్దిరోజులుగా రాజకీయ నాయకుల మధ్య జరుగుతోంది.
గతంలో కాంగ్రెస్‌కు బలమైన నియోజకవర్గంగా ఉండడం వల్ల కాంగ్రెస్‌ అభ్యర్థి అలెగ్జాండర్‌ సుధాకర్‌ ఈసారి ఎన్నికలలో కొంత ప్రభావం చూపించనున్నారు. బిజెపిని వ్యతిరేకిస్తున్నవారు అటు టిడిపి, ఇటు వైసిపికి ఓటు వేయడానికి ఇష్టపడటం లేదు. వీరి ఓట్లు కాంగ్రెస్‌ అభ్యర్థి దక్కించుకునే అవకాశం ఉంది. దీనివల్ల అటు వైసిపికి, ఇటు టిడిపికి కొంత నష్టం జరగవచ్చు.

➡️