కమ్యూనిస్టులతోనే ఆదివాసులకు రక్షణ

May 10,2024 00:00 #vijayanagaram

– గిరిజన చట్టాలను కాలరాస్తున్న బిజెపి
– వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు అడవుల విధ్వంసం
– ప్రజాశక్తితో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :కమ్యూనిస్టులతోనే గిరిజనులకు రక్షణ సాధ్యమౌతుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.పుణ్యవతి అన్నారు. గిరిజనులకు అనేక హక్కులు పోరాటాలు ద్వారా సాధించింది కూడా వామపక్షాలేనని గుర్తుచేశారు. అటువంటి గిరిజన చట్టాలను గడిచిన పదేళ్లలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలరాసిందని, ఇందుకు వైసిపి, టిడిపికి చెందిన ఎంపిలు వంతపాడారని తెలిపారు. కొండల్లోని విలువైన గనులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు అడవుల్లో విధ్వంసకర చర్యలు చేపడుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో బిజెపిని, దానికి పొత్తు, తొత్తుగా నిలుస్తున్న టిడిపి, వైసిపిలను ఓడించి, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ తదితర ఇండియా బ్లాక్‌ పార్టీలను గెలిపించుకోవాలని అన్నారు. ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తున్న పుణ్యవతి తనను కలిసిన ప్రజాశక్తికి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆమె మాటల్లోనే…

పార్వతీపురం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, మొండెంఖల్లు, సాలూరు గిరిజన ఉద్యమాలకు కేంద్రాలు వంటివి. దోపిడీకి వ్యతిరేకంగా గిరిజన రైతాంగ పోరాటం ఇక్కడే సాగింది. ఈ ప్రాంత ప్రజల పోరాటంతో ఎన్నో చట్టాలు, హక్కులు సాధించుకున్నారు. పదేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ఆయా చట్టాలను నిర్వీర్యం చేసేందుకు చట్ట సవరణలు చేసింది. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో పోరాటాలు చేయాల్సిన పరిస్థితుల్లో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి, వైసిపి ప్రభుత్వాలు ఏర్పడితే మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నేపథ్యంలో నాడు కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఎం ఆధ్వర్యాన జరిగిన పోరాటాలు, విజయాలు ఒక్కసారి గుర్తుచేసుకుంటే…
శ్రీకాకుళం ఉద్యమం 1958లో ప్రారంభమైంది. పాలకొండ ఏజెన్సీ, సీతంపేటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండ అనే గిరిజన గ్రామంలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న పల్లె రాములు మాస్టారు ఆ కాలంలో గిరిజన గ్రామాల్లో ప్రజలపై భూస్వాములు చేస్తున్న దోపిడీని చూసి చలించిపోయాడు. పల్లె రాము మస్టారు, హయగ్రీవరావు, పత్తిరాజులతోబాటు, వెంపటాపు సత్యం, పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు నాయకత్వంలో వెట్టిచాకిరీ అంతం చేయాలని, కూలిరేట్లు పెంచుకోవాలని అనే పిలుపుతో అనేక చోట్ల ఉద్యమాలు చేపట్టారు. ఆ రకంగా గిరిజనులను సమీకరించి, పోరాడిందీ, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిందీ కమ్యూనిస్టులే. కమ్యూనిస్టుల ద్వారానే హక్కుల పరిరక్షణ, అభివృద్ధి సాధ్యమౌతుంది. లేదంటే ప్రజాస్వామ్యాన్ని పక్కనబెట్టి సగటు మనిషిని దోచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మన్యం, అల్లూరి జిల్లాల్లో సుదీర్ఘకాలం పాటు గిరిజనులతో మమేకమై ప్రజా, గిరిజన, రైతాంగ ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర కమ్యూనిస్టులది.
దేశ వ్యాప్తంగా వామపక్షాల పోరాటాలు, యుపిఎ ప్రభుత్వంపై ఒత్తిడి ఫలితంగా అటవీ హక్కుల చట్టం, ఉపాధి హామీ చట్టాలను సాధించుకున్నాం. కానీ నేడు గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోంది. జిఓ 3 ద్వారా గిరిజన ప్రాంతంలో వారికే ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని అనేక పోరాటాలు చేశాం.
తోటపల్లి నిర్వాసితులకు న్యాయం చేయాలని 2005లో పెద్దయెత్తున పోరాడాం. ఆ పోరాటం రాష్ట్రంలోని నిర్వాసితులందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రత్యేకంగా భూ సేకరణ చట్టం తెచ్చేందుకు దోహదపడింది. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు, జీడిమామిడి, చింతపండు, చీపుళ్లు, కాఫీ గింజలు వంటి అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని పోరాడాం. అరకు ప్రాంతంలో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్దయెత్తున పోరాటం చేశాం. ఈ పోరాటాల ఫలితంగానే గతంలో కురుపాంలో ఎమ్మెల్యేగా, భద్రాచలం ఎంపిగా సిపిఎం అభ్యర్థులు గెలుపొందారు.

అరకు, పార్వతీపురం మన్యం ప్రాంతంతోపాటు అటు ఒడిశా, జార్ఖండ్‌, చత్తీస్‌గడ్‌ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు రాబందుల్లా కార్పొరేట్‌ కంపెనీలు కాచుకొని ఉన్నాయి. వాటికి బిజెపి ప్రభుత్వం మద్దతుగా ఉంది. అందుకే విశాఖ నుంచి రాయపూర్‌ వరకు గ్రీన్‌ఫీల్డు రహదారి, మన్యం ప్రాంతం మీదుగా రైల్వే మూడోలైన్‌ వేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే రైళ్లను రద్దు చేస్తూ, కార్పొరేట్లకు అవసమైన రహదారులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకులకు బాకీ ఎగేసినవి, కుల నిర్ధారణకు సంబంధించి అనేక కేసులున్న కొత్తపల్లి గీతకు బిజెపి అరకు ఎంపి సీటు ఇచ్చారు. గిరిజన హక్కులను భక్షించేందుకు, ప్రజల సంపదను కొల్లగొటేందుకు బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బిజెపి, వైసిపి, టిడిపిలకు గిరిజనులను ఓట్లడిగే హక్కు లేదు. వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే గిరిజన సమస్యలపైనా, వారి హక్కుల సాధనకు, చట్టాల రక్షణకు ఎన్నో పోరాటాలు చేసే అనుభవం ఉన్న సిపిఎం అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

➡️