1,352 మంది అభ్యర్థుల్లో 18 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు

న్యూఢిల్లీ :    లోక్‌సభ ఎన్నికల్లో మూడో దశలో పోటీపడుతున్న 1,352 మంది అభ్యర్థుల్లో 18 శాతం మంది  క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు. ఏడుగురు అభ్యర్థులు ముందస్తు నేరారోపణలున్నట్లు ప్రకటించారు. వీరిలో కేవలం 9 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది. మూడవ దశ ఎన్నికల పోలింగ్‌ మే 7వ తేదీన జరగనున్నాయి.

నేర చరిత్ర కలిగిన 244 మందిలో ఐదుగురిపై హత్య సంబంధిత అభియోగాలు ఉండగా, 24 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. అదనంగా 38 మంది అభ్యర్థులు మహిళలపై నేరాలతో సంబంధం కలిగి ఉండగా, 17 మంది విద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులను ప్రకటించారు.

1,352 మంది అభ్యర్థులు స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లపై ఈ సర్వే చేపట్టింది. అభ్యర్థుల ఆర్థిక అసమానతలను కూడా ఈ నివేదిక హైలెట్‌ చేసింది.

392 మంది అభ్యర్థులు లేదా 29 శాతం మంది కోటీశ్వరులు కాగా, ఒక్కో అభ్యర్థి సగటు ఆస్థి విలువ రూ.5.66 కోట్లుగా ఉంది. ప్రకటించిన ఆస్థుల పరంగా ముగ్గురు అభ్యర్థుల ఆస్థి విలు వందల కోట్లకు పైనే ఉండగా, అత్యధికంగా ప్రకటించిన ఆస్థి విలువ రూ.1,361 కోట్లను దాటింది.

639 మంది అభ్యర్థులు (47 శాతం) విద్యార్హతలు 5-12 మధ్య ఉండగా, 591 మంది అభ్యర్థులు (44 శాతం ) గ్రాడ్యుయేట్స్‌, అంతకు మించి విద్యార్హతలను కలిగి ఉన్నట్లు నివేదిక తెలిపింది.

➡️