రేవంత్‌పై ‘ఢిల్లీ పోలీస్‌’

Apr 30,2024 08:30 #CM Revanth Reddy, #Congress, #Telangana
  • రేపు విచారణకు రావాలని నోటీసులు 
  • భయపడేది లేదన్న తెలంగాణ సిఎం

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ప్రతిపక్ష నేతలను వేధించడానికి ఐటి, ఇడి, సిబిఐలను అడ్డగోలుగా వాడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం వాటికి తోడు ఢిల్లీ పోలీసులనూ రంగంలోకి దింపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ అరెస్ట్‌ తరువాత మరో కీలక బాధ్యతను వారికి అప్పగించింది. సాక్షాత్తు కేంద్ర హోంశాఖే ఫిర్యాదు చేయడంలో ఢిల్లీ పోలీసులు హుటాహుటిన కదిలారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. బుధవారం (మే ఒకటవ తేది) విచారణకు ఢిల్లీకి రావాలని నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌కు వచ్చి నోటీసులు అందచేశారు. సోమవారం అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ పరిణామం కలకలం రేపింది. ఈ తరహా బెదిరింపులకు భయపడేది లేదని తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. లిక్కర్‌ కేసులో ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పడుతున్న బిఆర్‌ఎస్‌ తాజా వ్యవహారంలో అందుకు భిన్నంగా ఉంది. ఆ పార్టీ సీనియర్‌ నేత,మాజీ మంత్రి హరీష్‌రావు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిని తక్షణం అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఏం జరిగింది….?
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే ఎస్‌సి, ఎస్‌టిలకు ఉన్న రిజర్వేషన్లను రద్దు చేస్తారని, దానికోసమే 400 సీట్లు కావాలని అడుగుతున్నారని రెండు, మూడు రోజుల క్రితం తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ ఒక వీడియోను కాంగ్రెస్‌ పార్టీ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసింది. దీంతో ఆ వీడియో వైరల్‌ అయింది. ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామం బిజెపి నేతలను ఇరుకున పెట్టింది. తాము రిజర్వేషన్లకు అనుకూలమేనంటూ ఆ పార్టీ అగ్రనేతలు పదేపదే వివరణ ఇవ్వాల్సివచ్చింది.
మరోవైపు రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ దీనిని డీప్‌ ఫేక్‌ వీడియోగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఢిలీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సెక్షన్‌ 153/153/465/469/171జి ల కింద కేసు నమోదు చేశారు. డీప్‌ ఫేక్‌ వీడియో షేర్‌ చేశారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు, పలువురు కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు పంపారు. వీడియోను షేర్‌ చేయడానికి వాడిన సెల్‌ఫోన్లతో పాటు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను కూడా తీసుకుని మే ఒకటవ తేది ఢిల్లీలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ప్రశ్నించినందుకే…
బిజెపిని ప్రశ్నించినందుకే తనకు నోటీసులు జారీ చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన ఆయన ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోడీ ప్రభుత్వం ఇడి, సిబిఐ, ఐటి అధికారులను పంపిస్తున్నారని, ఈ సారి ఢిల్లీ పోలీసులను పంపారని చెప్పారు. ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ‘సోషల్‌ మీడియాలో బిజెపిని ప్రశ్నించా… దీనికి తెలంగాణ ముఖ్యమంత్రినైన నాకూ, గాంధీ భవన్‌లోని ఇతర నేతలకూ అమిత్‌షా నోటీసులు పంపుతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.

➡️