‘ఒకసారి సరి చూసుకోండి…’

Apr 29,2024 05:30 #'Take a look...'

డెబ్బయ్యో దశకంలో ఓ బాపు కార్టూన్‌… ఒక రచయిత్రి కోపంగా పోస్ట్‌మాన్‌పై విరుసుకు పడుతూంటుంది… అతను బిక్కమొహం వేసుకుని ”మీ కథల్ని పత్రికల వాళ్లు తిరగ్గొడితే, నా తప్పేంటి అమ్మా?” అని అంటుంటాడు.
రచయితకి వచ్చిన ప్రతి ఊహా రచనగా రూపొందదు. అలాగే ప్రతి రచనా ప్రచురణకు నోచుకోదు. కొన్ని రచనల్ని పత్రికలు తిప్పి పంపుతూ వుంటాయి. వాటికి ప్రచురణార్హత లేకపోవడమే దీనికి కారణం. ఇందుకోసమే రచనతో పాటు స్టాంపులు అంటించిన సొంత చిరునామా రాసిన కవర్లని పంపమని పత్రికలు రచయితలకి సూచిస్తూ వుంటాయి.
ఇలా పత్రికలు కొన్ని రచనల్ని తిప్పి పంపడానికి కారణాలు అనేకం. ఒక రచనలోని వస్తువు సంపాదకునికి నచ్చకపోవడమో, అంశం నచ్చినా శైలీ లోపమో లేదా అల్ప శిల్ప స్థాయో కారణం కావొచ్చు. రచనలోని అంశం పత్రిక పాలసీకి విరుద్ధంగా వుంటే సహజంగానే ప్రచురించరు. అలాగే తమ పత్రిక ప్రమాణాలను ఆ రచన అందుకోలేనప్పుడు ప్రచురణకు స్వీకరించలేరు. కొన్ని సందర్భాల్లో సైద్ధాంతిక సమస్య కూడా కారణం కావొచ్చు. చాలా సందర్భాల్లో పత్రికలు ‘స్థాయి’ తక్కువ వున్న రచనల్ని తిప్పి పంపుతూ వుంటాయి. ఒక్కోసారి దీనికి విరుద్ధమైన ఉదంతాలు కూడా వుండొచ్చు.
ప్రఖ్యాత రచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలం తన ఆత్మకథ ‘ఆరామ గోపాలం’లో ఒక సంఘటనను ఉదహరించారు. ఆయన కొన్నాళ్లు ఆంధ్రజ్యోతి వారపత్రికలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారికి సహాయకుడిగా వున్నారు. ఆ రోజుల్లో ప్రఖ్యాత రచయిత త్రిపుర ఒక కథని పంపారు. జ్యోతి వారు ఆ కథని తిప్పి పంపుతూ ”ఈ పత్రిక ‘స్థాయి’ని మించి వున్న కారణంగా ప్రచురించలేకపోతున్నందుకు చింతిస్తున్నాం” అన్న కామెంటు పెట్టారట.
సాధారణంగా వర్ధమాన రచయితల రచనలు పత్రికల నుంచి ఎక్కువగా తిరిగి వస్తూ వుంటాయనే భావన వుంది. ఇందులో నిజం లేకపోలేదు. అయితే కొందరు ప్రసిద్ధ రచయితల రచనలూ తిరిగొచ్చిన సందర్భాలు అనేకం. ”ఐ టూ హేవ్‌ రిజెక్షన్‌ స్లిప్స్‌” అన్న మాట ఎవరో సామాన్య రచయితది కాదు. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ రచయిత ఆర్కే నారాయణ్‌ చెప్పిన మాట ఇది. కొత్త రచయితలు ఈ తిరుగుటపాల్ని చూసి, తమ రచనలు ప్రచురణ కాకపోవడం చూసి, డీలా పడిపోకూడదు. ఇంకా సాధన చెయ్యాలనే సందేశం వీటిలో చూసుకోవాలి. మరోసారి రచనను జాగ్రత్తగా పరిశీలించి లోపాల్ని కనుక్కోవాలి. సీనియర్ల సలహాలను స్వీకరించాలి. సంస్కరించుకుని మరో పత్రికకి పంపాలి.
‘లోకో భిన్న రుచిః’ అన్నట్టు ఒక పత్రిక వారు తిప్పి పంపిన కథ మరో పత్రికలో బహుమతి పొందిన సందర్భాలూ వున్నాయి. అప్పుడప్పుడు రచన పత్రికల వారికి నచ్చీ, వేరే కారణాల వల్ల వేయలేని పరిస్థితులు వుంటే, ఆ రచన పట్ల లేదా రచయిత మీద గౌరవంతోనో పత్రికల వారే పోస్టేజి భరించి అలాంటి రచనల్ని రచయితకి తిప్పి పంపిన సందర్భాలూ వుంటాయి. ఇలాంటి ఘటన నా స్వానుభవంలో వుంది. ఒక ప్రముఖ వారపత్రిక నా కథని భద్రంగా తిప్పి పంపింది, తిరుగుటపా పెట్టకపోయినా.ఒక ప్రసిద్ధి వారపత్రిక రచన అందగానే రచయితకి ఓ ప్రింటెడ్‌ కార్డు పంపేది. ఆ కార్డు ఆకుపచ్చ రంగులో వుంటే, దాన్ని చూడగానే ఆ రచన ప్రచురణకు స్వీకరించినట్టు తెలిసిపోయేది. అదే నారింజ రంగులో వుంటే సెలెక్టు కాలేదని అర్థం. ఇప్పుడు పత్రికలు ”ఈ-మెయిళ్ల” ద్వారా రచనల్ని స్వీకరించిందీ లేనిదీ తెలియజేస్తున్నాయి. అయితే పత్రికల నుంచి ‘మేఘ’ సందేశాలు ఖచ్చితంగా వస్తున్నట్టు కనిపించదు. కరోనా అనంతరం పత్రికా రంగంలో వచ్చిన మార్పులు, సిబ్బంది తగ్గిపోవడం తదితర కారణాల వల్ల ఈ విషయాన్ని పత్రికలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు డిజిటల్‌ పత్రికలు ఎక్కువయ్యాయి. ఇవి వచ్చిన రచనల్ని వచ్చినట్టు వేసుకుంటున్నాయని చాలామంది భావన. వీటి దృష్టిలో రచనలు అంటే స్పేస్‌ ఫిల్లర్లు. అంచాత రచనలు తిరిగి రావడం అన్నది తగ్గిపోయింది.
తిరిగొచ్చే రచనల్ని వస్తువుగా తీసుకుని ఈ వ్యాస రచయిత ‘పెంపుడు పావురాళ్లు’ అన్న కవితాత్మక శీర్షికతో ఓ కథని రాశాడు. ఓV్‌ా… అది తిరిగి రాలేదు. ఒక దినపత్రిక ఆదివారం అనుబంధంలో ప్రచురణ అయ్యింది. పెంపుడు పావురాళ్లు పగలంతా ఎక్కడ తిరిగినా సాయంత్రానికి బుద్ధిగా తిరిగొచ్చేస్తాయి కదా!
ప్రచురణార్హతే ఒక రచన విలువను నిర్ణయించే గీటురాయి. ప్రచురణే రచనకు రాజముద్ర! రచన పట్ల సంపాదకుని దృష్టికోణం వేరుగా వుంటుంది. రోగి నాడిని చూసి ఆరోగ్య స్థితిని నిర్ణయించే వైద్యుడిలా రచన ‘స్థితి’ని ఎడిటర్జీ నిర్ణయిస్తాడు. మనం ఫోనులో నెంబరును తప్పుగా కొట్టినప్పుడు ”మీరు డయల్‌ చేసిన నెంబర్‌ని ఒకసారి సరి చూసుకోండి” అన్న వాయిస్‌ మెసేజ్‌ వస్తుంది. రచయితలకు తిరిగొచ్చే రచనలు ఇచ్చే సందేశం కూడా సరిగా ఇదే!

– ఎస్‌. హనుమంతరావు, 88978 15656

➡️