ప్రయోగాలను ప్రోత్సహించండి..!

May 5,2024 07:32 #Sneha

పిల్లలకు బాల్యంలో అన్నీ అబ్బురంగానే అనిపిస్తాయి.. ఏదైనా వాస్తవికంగానే తెలుసుకోవాలనుకుంటారు కూడా. ఆ వయస్సులో వారికున్న జిజ్ఞాస అలాంటిది అంటున్నారు నిపుణులు. సహజంగానే ఈ ఆసక్తే అనేక ఆవిష్కరణలకు దారితీస్తాయని చెప్తున్నారు. అయితే తర్వాత్తర్వాత దాన్ని ఆ వైపుగా నడిపించడంలోనే పేరెంటింగ్‌, చుట్టూ ఉన్న పరిస్థితులు కీలకమని నిపుణులు చెప్తున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు.

పిల్లలకు ఒక బొమ్మ ఇస్తే.. అది ఏదైనా సౌండ్‌ చేస్తుంటే.. ఆ సౌండ్‌ ఎక్కడి నుంచి వస్తుందోనని ఆ బొమ్మను అన్నివైపుల నుంచి పరిశీలిస్తారు.. అది తెలిసే వరకూ ఆ పరిశోధన కొనసాగుతూనే ఉంటుంది. పిల్లల ముందు మ్యాజిక్‌ అని ఏదైనా జిమ్మిక్కులు చేసినా.. వాళ్లు అది ఎలా జరిగిందన్న ఆలోచనను లోలోపల చేస్తుంటారని నిపుణులు చెప్తున్నారు.
గమనించే లక్షణం..
పిల్లలకు బోలెడన్ని సందేహాలు వస్తుంటాయి.. గింజ నుంచి మొక్క ఎలా మొలుస్తుందీ అన్నది తెలుసుకోవాలనుకుం టారు. అలాంటి ఆలోచనలు చేస్తుంటే తప్పకుండా తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని చెప్తున్నారు నిపుణులు. అసలు ఎవరికైనా గమనింపు అనేది చాలా మంచి లక్షణం.. గమనించడంతోనే చాలా విషయాలు తెలుసుకోవడం సాధ్యమవుతుంది. అందుకే పిల్లలకు కొన్ని వేరుశనగ గింజలు ఇచ్చి, ఒక కుండీలో నాటించండి.. దానికి క్రమం తప్పకుండా నీళ్లు పోయించండి.. అది మొలకెత్తే ప్రతి దశనూ వారిని గమనించ మనండి.. అది మొలకెత్తాక వారి మోముల్లో ఆనందం వర్ణించ సాధ్యం కాదు. అలాగే వేరుశనగలు చెట్టుకు పైన కాకుండా వేర్లలో వస్తాయన్నదీ వారికి మరింత అబ్బురం కలిగిస్తాయి. ఒక్క గింజతో బోలెడు వేరుశనక్కాయలు రావడం మరో ఆశ్చర్యం వారికి.. ఇవన్నీ పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దేలా చేస్తాయి. ఇదీ వారి చేత చేయించిన ప్రయోగమే కదా! ఇలా చేయించడం వల్ల వారి మదిలో ఆ విజ్ఞానాన్ని నాటుకుపోతుందనేది నిపుణులు మాట.
రంగుల కలయికలు..
పిల్లలకు ఆకాశంలో హరివిల్లు ఓ అబ్బురం.. వర్షం కురియడం మరో ఆశ్చర్యం.. పిల్లలకు రంగుల విషయంలో జరిగే తమాషాలను పేరెంట్స్‌ దగ్గరుండి ప్రయోగాలు చేయిస్తే.. భలే సంతోషిస్తారు. ఏయే రంగులు కలిపితే.. మరో కొత్త రంగు ఎలా వస్తుందో తెలుసుకుని ఆశ్చర్యపోతారు. అలా కొత్త కొత్త రంగుల్ని సృష్టించి.. తామే ఆ రంగును కనిపెట్టామని అందరికీ చెప్తూ సందడి చేస్తారు. అలాగే ప్రకృతిలో రంగుల్ని గమనించేలా ప్రోత్సహిం చాలి.. అది వారికి నిర్ధారణ అయ్యేందుకు పేరెంట్స్‌ బొమ్మల పుస్తకం తెచ్చి.. అందులో బొమ్మలకు రంగులు వేయించాలి. అప్పుడు చెట్టు బొమ్మకి ఏయే భాగాలకు ఏమేమి రంగులు వేయాలో ప్రకృతి నుంచే నేర్చుకుం టారు. ఇలాంటి ప్రయోగాలు పిల్లలకు గమ్మత్తుగా అనిపిస్తాయి. ఇలా వారికి రంగుల మేళవింపులు చేయడం వీలవుతుంది. ప్రకృతి నుంచి రంగుల్ని తమ సొంతం చేసుకున్నంత సంబరపడిపోతారని నిపుణులు చెప్తున్నారు.
నీటిలో తేలడం.. మునగడం..
పిల్లలకు వర్షం పడినప్పుడు అల్లిబిల్లి ఆడుతుంటారు.. అన్నింటికీ మించి.. జోరుగా వర్షం కురిస్తే.. ఆ వాన నీటిలో తమ నోట్‌ పుస్తకాల్లోంచి పేజీలు చించేసి.. పడవలు చేసి వదులుతారు. అది అలా నీటిపై తేలుతూ వెళుతుంటే.. వాళ్ల ఆనందం చెప్పనలవికాదు.. అయితే అది అలా ఎందుకు తేలిందో.. వాళ్లకు పేరెంట్సే చెప్పాలి.. అందులోని సైన్స్‌ చెబితే.. పిల్లలకు మరింత ఆసక్తి పెరిగి, ఎన్నో ఆవిష్క రణలు చేసేందుకు ఆలోచనలు చేస్తారు. నీటిలో ఏది తేలుతుందో.. ఏది మునిగిపోతుందో.. పిల్లలతోనే ప్రయోగాలు చేయించాలి.. అది వారి విజ్ఞానాన్ని పెంపొందించేందుకు తోడ్పడుతుందనేది నిపుణుల మాట.

 

సందేహాలకు పరిష్కారం..
పిల్లలకు బోలెడన్ని సందేహాలు వస్తుంటాయి.. అవన్నీ తెలియాలంటే వారికి ప్రయోగాలతోనే పరిష్కారం లభిస్తుంది. రుచి తెలియడం కూడా నాలుకకు ఉన్న రుచి గ్రంథుల గురించిన అవగాహన కలిగిస్తుంది. కొద్దిగా ఉప్పు ఉప్పగా ఉంటుందా? తీపిగా ఉంటుందా? పంచదారా? ఉప్పా? పిల్లలకు సందేహాలు వస్తుంటాయి. అవి నాలుకపై పెట్టుకుని తెలుసుకోవచ్చు. అలాగే వాటి మధ్య ఉన్న సారూప్యతనూ అర్థమయ్యేలా వారికి చెప్పడం సులువవుతుంది. గాలి వీయడం.. మొక్క సూర్యుని దిక్కుగా వంగుతూ పెరగడం.. వారికి తెలియజేసి, కారణం చెబితే.. వారికి ఆ విజ్ఞానం ఎప్పటికీ చెదిరిపోకుండా ఉంటుంది.
ఇలా పిల్లలకు సైన్స్‌ పరంగా విజ్ఞానం పెంచేలా పేరెంట్స్‌ ప్రయోగాలు చేయించాలి. వారిని మరింతగా ప్రోత్సహించాలి. అంతేగానీ.. మూఢత్వం, అబద్ధపు భావజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కించకండి.. దెయ్యాలు, పిశాచాలు ఉన్నాయంటూ భయపెట్టకండి. ఏదేమైనా.. పిల్లలకు ప్రయోగాలతో వాస్తవాలు తెలుసుకునే అలవాటు చేస్తే.. మీరు అబద్ధాలు చెప్పినా.. వాటిని నిరూపించమని వారు కోరుతున్నారంటే.. ఆ పిల్లలు సరైన దిశలో ఎదుగుతున్నట్లే అర్థం.. పేరెంట్స్‌ వారేదో చెడిపోతున్నారనే తప్పుడు వాదనలు చేయొద్దు. శాస్త్రీయ ఆలోచనలతో పెరిగే పిల్లలు తప్పక సమాజాభివృద్ధికీ ఉపయోగపడతారు.

➡️